తెలంగాణ రైతుల తరఫున నరేంద్ర మోడీ, పీయూష్ గోయల్‌కు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా.. దయచేసి తెలంగాణ లో పండించిన పంటను కొనుగోలు చేయండి అని వేడుకున్నారు సీఎం కేసీఆర్. పంట కొనుగోళ్లపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఢిల్లీలో ధర్నాకు దిగింది.
సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. కేంద్రానికి డెడ్ లైన్ పెట్టారు. ధాన్యం కొనుగోలు చేయండి.. కొనుగోళ్లపై 24 గంటలు టైం ఇస్తున్నాం.. అప్పటి వరకు ఎదురుచూస్తాం.. అప్పటికీ స్పందించకుంటే ఆ తర్వాత ఏం చేయాలో మాకు తెలుసు.. మా నిర్ణయం మేం తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుందో చూడండి.. అంటూ హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సీఎం హెచ్చరికలతో టీఆర్ఎస్ శ్రేణులు ట్విట్టర్ వేదికగా బీజేపీని టార్గెట్ చేస్తూ సమాధానం చెప్పాల్సిందిగా ట్వీట్లు చేశారు. అయితే.. ప్రస్తుతం సీఎం కేసీఆర్ చెప్పిన 24 గంటలు పూర్తవడంతో సర్వత్రా చర్చ మొదలైంది.
కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ ఏంటన్న ఆలోచనలో పడ్డారు. అయితే.. దీనిపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. 24 గంటలు పూర్తయ్యిందని చెప్పుకుంటూ.. డీజే టిల్లులోని ‘ఏయ్ బాబు లే’ అనే వీడియోని పోస్ట్ చేస్తూ సీఎం కేసీఆర్ కు గుర్తు చేస్తున్నారు. దీంతో పాటు బీజేపీ నేతలు చేసిన మరికొన్ని పోస్టులు వైరల్ గా మారాయి.