ఏపీలో పోలీసులే పాలన చేస్తున్నట్టు కనిపిస్తోందని.. అసలు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉందో లేదో అర్థం కావడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా ఆస్పరి పోలీసుల చేతిలో గాయపడి ఆదోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాయకులను ఆయన పరామర్శించారు. జిల్లాలో ఘోరమైన ఘటనలు జరుగుతుంటే పోలీసు వ్యవస్థ నిద్రపోతుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీపీఐ కార్యదర్శి విరుపాక్షి, ఏఐవైఎఫ్ నాయకులపై ఆస్పరి ఎస్సై ముని ప్రతాప్ విచక్షణా రహితంగా దాడి చేశారని మండిపడ్డారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పి కొట్టారంటూ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసుల ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోయిందని విమర్శించారు.
రాష్ట్రంలో పోలీసులు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. కనీసం ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంత దుర్మార్గ పాలన నడుమ జగన్ అసెంబ్లీ ఎందుకు నిర్వహిస్తున్నాడో అర్థం కావడం లేదని రామకృష్ణ మండిపడ్డారు.
న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన విరుపాక్షిని విచక్షణా రహితంగా కొట్టి.. అసభ్యకర పదజాలంతో మహిళనున దూషించిన పోలీసులపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సై ముని ప్రతాప్ ని తొలగించాలన్నారు. పోలీసుల తీరును విజయవాడ అఖిలపక్షం మీటింగ్ లో ఎండగడతామని హెచ్చరించారు రామకృష్ణ.