ఏపీ ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. విభజన చట్టం పెండింగ్ అంశాల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అజెండాలో తొలుత ప్రత్యేక హోదాను కూడా కేంద్రం చేర్చింది. వెంటనే బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు దీనిపై స్పందిస్తూ.. ఈ కమిటీకి ప్రత్యేకహోదాతో సంబంధం లేదని తేల్చి చెప్పారు.
ఏపీ ప్రత్యేక హోదా గురించి తెలంగాణ రాష్ట్రంతో చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత అజెండా నుంచి ప్రత్యేక హోదాను కేంద్ర హోంశాఖ తొలగించిందని పేర్కొన్నారు. ఈ పరిణామాలు వైసీపీ నేతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయన్నారు.
దీనికి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కౌంటర్ వేశారు. కేంద్ర ప్రభుత్వ కమిటీ అజెండా ఎందుకు మారిందని ప్రశ్నించారు. ఏపీకి అనుకూలంగా కేంద్ర కమిటీ ఒక అంశాన్ని అజెండాలో పెడితే జీవీఎల్ ఎందుకు అంత హడావుడి చేశారని ప్రశ్నించారు.
దీనికి జీవీఎల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అజెండాలో ప్రత్యేక హోదా ఉంటే జీవీఎల్ ఎందుకు స్వాగతించలేకపోయారని నిలదీశారు. జీవీఎల్ వ్యాఖ్యలపై చర్చ జరగాలని రాంబాబు అన్నారు.