దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. తాగే నీళ్ల కోసం మహిళను హత్య చేశాడు ఓ దుండగుడు. అడ్డుకోబోయిన ఆమె భర్తపై కూడా దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీలోని వసంత్ ఖంజ్ కు చెందిన శ్యామ్ కళ అనే మహిళ ఉదయం 6 గంటలకు నీళ్ల కోసం ఇంటి నుంచి వెళ్లింది.
నీళ్లు పట్టుకునే దగ్గర పక్కింటికి చెందిన అర్జున్ అనే వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు ఆమెతో గొడవపడ్డారు. ఈ గొడవ కాస్త పెద్దగా మారింది. ఆగ్రహించిన అర్జున్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. గొంతు కోసి హత్య చేశాడు.
గమనించిన బాధిత మహిళ భర్త ఆమెను కాపాడేందుకు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. భర్తపై కూడా నిందితుడు దాడి చేసి గాయపర్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు.
అర్జున్, అతడి కుటుంబ సభ్యులు భయపెట్టిస్తున్నారంటూ కాలనీవాసులు పోలీసులతో మొరపెట్టుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.