హైదరాబాద్ రెయిన్ బో ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ప్రసవానికి వచ్చిన వారి వద్ద వైద్యం పేరుతో 60 లక్షలు వసూలు చేశారు ఆసుపత్రి నిర్వాహకులు. అడిగిన మొత్తాన్ని చెల్లిస్తే.. నవజాత శిశువుల మృతదేహాలను బహుమతిగా ఇచ్చారు వైద్యులు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ రెయిన్ బో ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
బంజారాహిల్స్ లోని రెయిన్ బో ఆసుపత్రిలో ఏప్రిల్ 24న సువర్ణ అనే మహిళ ప్రసవం కోసం అడ్మిట్ అయింది. సువర్ణ ప్రసవానికి ఇంకా సమయం ఉందని చెప్పిన డాక్టర్లు గర్భిణీ వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. అలా 12 రోజుల హాస్పిటల్ లో ఉన్న తర్వాత.. పడ్డంటి కవలలకు జన్మించింది.
ఒకే కాన్పులో ఒక పాప, ఒక బాబు జన్మించడంతో కుటుంబ సభ్యులు ఆనంద పడ్డారు. కానీ.. వాళ్లకు ఆ ఆనందం ఎంతో కాలం ఉండలేదు. పాప జన్మించిన మూడు రోజులకే పాప చనిపోందని చెప్పారు డాక్టర్లు. అయితే.. పాప చికిత్సకు కోసం 19.90 లక్షలు వసూలు చేసింది హాస్పిటల్ యాజమాన్యం.
బాబు అయినా క్షేమంగా ఉన్నాడని అనుకుంటున్న బాధితులకు.. చికిత్స పొందుతున్న బాబు వైద్య ఖర్చులకు 33.16 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు ఆ మొత్తాన్ని చెల్లించారు. ఆ వెంటనే హాస్పిటల్ యాజమాన్యం బాధిలకు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది.
చికిత్స పొందుతూ బాబు మరణించినట్టు వెల్లడించారు. దీంతో ఆగ్రహించిన బాధితులు.. హాస్పిటల్ ముందు నిరసనకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డలు చనిపోయారని ఆరోపిస్తున్నారు సువర్ణ భర్త రఘునాధరెడ్డి. ఇప్పటి వరకు మొత్తం రూ. 60 లక్షలు వసూలు చేసినట్లు చెప్తున్నారు. ఆసుపత్రి బిల్లులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. రెయిన్ బో ఆసుపత్రిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు.