వరంగల్ లో యువనేత పవన్ పై దాడిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోంది. పార్టీ అధ్యక్షుడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఇది ముమ్మాటికీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కనుసన్నల్లోనే జరిగిందని ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది హస్తం పార్టీ. సీపీ రంగనాథ్ ను కలిసిన రేవంత్.. ఎమ్మెల్యేతోపాటు అనుచరులపైనా చర్యలు తీసుకోవాలన్నారు.
దాడిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరులు పవన్ పై కిరాతకంగా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అవినీతిపై పోస్టర్లు అతికిస్తుంటే ఎలా దాడి చేస్తారని.. పోలీసులకు ఇదంతా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తాము ప్రతిదాడులకు దిగితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్రం వదిలిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అటెంప్ట్ మర్డర్ కింద వినయ్ భాస్కర్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
అయితే.. పవన్ పై జరిగిన దాడిలో బీఆర్ఎస్ కు గానీ, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కు గానీ ఎలాంటి సంబంధం లేదని వరంగల్ కుడా ఛైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అంటున్నారు. ఛత్రపతి శివాజీపై పవన్ పెట్టిన తప్పుడు పోస్టింగ్స్ వల్ల జరిగిన ఘర్షణను బీఆర్ఎస్ పై రుద్దుతున్నారని ఆరోపించారు. వినయ్ బాస్కర్ లాంటి వారిపై చిల్లర మాటలు మాట్లాడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. చిల్లర ఆరోపణలు మానుకోవాలంటూ హెచ్చరించారు సుందర్ రాజ్. కాంగ్రెస్ నాయకులు వాళ్ళల్లో వాళ్లే కొట్టుకొని తమపై నెపం మోపుతున్నారని ఆరోపించారు. గ్రూప్ వార్ లో తన్నుకొని బీఆర్ఎస్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా వినయ్ బాస్కర్ వరంగల్ పశ్చిమలో ఐదోసారి గెలవడం ఖాయమని విశ్యాసం వ్యక్తం చేశారు కుడా ఛైర్మన్.