చాటలో తవుడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్లు కేంద్రం వైఖరి ఉందని ఖమ్మం బహిరంగ సభలో కేసీఆర్ బీజేపీని తీవ్రంగా విమర్శించారు. ఖమ్మం చరిత్రలోనే ఇది అద్భుత భారీ బహిరంగ సభ అని అన్నారు. ఖమ్మం సభ దేశంలో ప్రజల మార్పునకు సంకేతమని చెప్పారు కేసీఆర్.
ఖమ్మంలోని ప్రతి పంచాయతీకి 10 లక్షల చొప్పున మంజూరు చేసినట్టుగా సభా ముఖంగా కేసీఆర్ ప్రకటించారు. 589 గ్రామ పంచాయతీలకు 10 లక్షల చొప్పున నిధులను మంజూరు చేశారు సీఎం. 10 వేల జనాభా దాటిన మేజర్ పంచాయతీలకు 10 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తూ ప్రకటన చేశారు. అదే విధంగా ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీలకు 30 కోట్ల చొప్పున నిధులు, ఖమ్మం మున్సిపాలిటీకి 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా సభా ముఖంగా ప్రకటించి ఖమ్మం జిల్లా పై వరాల జల్లు కురిపించారు కేసీఆర్.
ఇక ఖమ్మం మున్నేరు నదిపై వంతెనతో పాటు ఖమ్మం జిల్లాకు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేశారు.జర్నలిస్టులకు ఖమ్మం జిల్లా కేంద్రంలో నెలలోగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ స్థలం దొరక్కపోతే సేకరించైనా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్. భారాస విధానం, వ్యూహం తర్వాత వివరంగా చెబుతామని చెప్పారు కేసీఆర్.
భారత్ అన్ని విధాలా సుసంపన్నమైన దేశమని,జలవనరులు, సాగు భూమి విషయంలోనూ మన దేశమే అగ్రగామి అని అన్నారు కేసీఆర్. కెనడా నుంచి కందిపప్పు దిగుమతి సిగ్గుచేటు కాదా అన్ని ప్రశ్నించారు. దేశంలో 70 వేల టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని.. కేవలం 20 వేల టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నారని చెప్పారు. దేశానికి నిర్దిష్ట లక్ష్యం లేకుండా పోయిందన్నారు. జింబాబ్వేలో 6 వేల టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ ఉందని.. చైనాలో 5 వేల టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ ఉందని..మన దేశంలో అతిపెద్దదైన ఒక్క రిజర్వాయర్ ఉందా అని నిలదీశారు. దేశంలో చైతన్యం తెచ్చేందుకు పుట్టిందే భారాస అని కేసీఆర్ అన్నారు.
బకెట్ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చాచాలా..రాష్ట్రాల మధ్య నీటి యుద్దాలు అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు కేసీఆర్. డొల్లమాటలు, కల్ల మాటలతో పొద్దుపుచ్చే పరిపాలన కేంద్రానిది అని విమర్శించారు.