ఏపీలో ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గించింది. తెలంగాణ సర్కారు టికెట్ రేట్లు పెంచింది. తర్వాత ఏపీలో ఓ మోస్తరుగా పెంచారు. అటు తెలంగాణలో పెద్ద సినిమాల కోసం మరింతగా రేట్లు పెంచారు. ఇలా టికెట్ రేట్లపై గడిచిన 6-7 నెలలుగా చాలా గందరగోళం నడిచింది. ప్రస్తుతం టికెట్ రేట్ల వ్యవహారం కొలిక్కి వచ్చింది. అవి ఎలా ఉండాలనే అంశంపై ప్రేక్షకులే, టాలీవుడ్ కు స్పష్టత ఇచ్చారు. ఏ సినిమాకు ఎంత టికెట్ రేట్ ఉంటే థియేటర్లకు రావాలో ప్రేక్షకులే మేకర్స్ కు చెబుతున్నారు.
టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్న సినిమాల్ని చూడడం మానేశారు ఆడియన్స్. కాస్త బజ్ ఉండి, తమకు అందుబాటులో ఉన్న సినిమాల్ని మాత్రమే చూస్తున్నారు. ఈ క్రమంలో తమ సినిమాలకు ఏ రేటు పెడితే ఆడియన్స్ వస్తారో మేకర్స్ కు అర్థమైపోయింది. అందుకే అవే రేట్లు పెడుతున్నారు.
మేజర్, ఎఫ్3 లాంటి సినిమాలకు టికెట్ రేట్లు సాధారణంగానే ఉంచారు. ఇక చిన్న సినిమాలకైతే టికెట్ రేట్లను మరింత తగ్గించారు. త్వరలో థియేటర్లలోకి రాబోతున్న పక్కా కమర్షియల్ సినిమాకు ఇంకా తగ్గించారు. ఓవరాల్ గా చూసుకుంటే.. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. మిడ్ రేంజ్ సినిమాలకు మల్టీప్లెక్సుల్లో 250 రూపాయలు, సాధారణ సినిమాలకు 200 రూపాయలు అనధికారికంగా ఫిక్స్ చేశారు. సింగిల్ స్క్రీన్స్ లో ఈ రేటు 150 నుంచి 200 రూపాయల మధ్య ఫిక్స్ అయింది.
అయితే.. చిన్న సినిమాలకు ఈ రేట్లు కూడా సమంజసం కాదనేది ప్రేక్షకుల వాదన. ఈ విషయాన్ని తమ చేతల ద్వారా చూపిస్తున్నారు. తాజాగా రిలీజైన సమ్మతమే, చోర్ బజార్ లాంటి సినిమాలకు మల్టీప్లెక్సుల్లో 200 రూపాయల రేటు పెట్టారు. ఈ రేటుపై సినిమాలు చేసేందుకు ప్రేక్షకులు ఎవ్వరూ సముఖంగా లేరని, ఆక్యుపెన్సీ చూస్తేనే అర్థమౌతోంది.
మరోవైపు క్యాంటీన్ రేట్లు కూడా ప్రేక్షకులు, థియేటర్లవైపు రాకపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సమోసా, పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు భారీగా ఉన్నాయి. టికెట్ రేట్లతో పాటు స్నాక్స్ ధరల్ని కూడా తగ్గిస్తే, సామాన్య ప్రేక్షకుడు థియేటర్లకు వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే.. థియేట్రికల్ వ్యవస్థ పెద్ద సినిమాలకు మాత్రమే పరిమితమౌతుంది.