నవీన్ కుమార్ రెడ్డి, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్
తిరుపతిలో 500 సంవత్సరాల చరిత్ర కలిగిన చెరువులను నామరూపాలు లేకుండా చేశారు. పరిసర ప్రాంత గ్రామాలలోని 180 ఎకరాల విస్తీర్ణం గల వ్యవసాయ భూములకు బోరు, బావుల ద్వారా పుష్కలంగా నీరు అందించడంతో పాటు.. త్రాగునీటిని అందిస్తున్న అవిలాల చెరువు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో ఉట్టికి స్వర్గానికి కాకుండా తయారైంది.
తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో పూర్వం నుండి ఉన్న సుమారు 100 నీటి కుంటలు, కాలువలు, చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో తిరుపతి నగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చెరువుల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ఇవన్నీ ఎంతో చరిత్ర కలిగిన చెరువులు. అధికారుల నిర్లక్ష్యంతో అవన్ని అన్యక్రాంతమయ్యాయి. దీని కారణంగా భవిష్యత్తు తరాలకు నీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది. కుంటలను, చెరువులను, కపిల తీర్థం, మాల్వాడి గుండంలలో నిరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటే.. ఇంకో ముప్పై ఏళ్ల పాటు తిరుపతి నగరంలో నీటి సమస్య వచ్చే ఆస్కారమే ఉండదు. కపిలతీర్థం, మల్వాడి గుండం నుండి పారే వర్షపు నీటిని.. గాలేరు, నగరి కాలువకు అనుసంధానం చేయాలి. లేదంటే రిజర్వాయర్ నిర్మించి నీటిని నిల్వ ఉంచాలి.
అవిలాల చెరువుని అలాగే చెరువుగా కొనసాగించాలి. ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను అనేక మంది స్థానికులు ఆశ్రయించడంతో సంబంధిత శాఖలకు నోటీసులు సైతం జారీ చేయడం జరిగింది. టీటీడీ అధికారులు పార్కు పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చించి అవిలాల చెరువును కాంక్రీట్ జంగిల్ గా మార్చేశారు. దానిని పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేశారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని చెరువులను పరిరక్షించాల్సిన బాధ్యత ఇరిగేషన్ తుడా రెవెన్యూ, టీటీడీ నగరపాలక సంస్థతో పాటు.. ప్రభుత్వ, అధికార పార్టీ నాయకులపైన కూడా ఉంది.