ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం తీవ్ర సంక్షోభాన్ని కలిగించింది. ఉక్రెయిన్ ప్రజల జీవితాల్లో చీకట్లను నింపింది. యుద్ధం కారణంగా ఇప్పటికే చాలామంది మాతృభూమిని వీడి పొరుగు దేశాలకు వెళ్లిపోయారు. ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ఖాళీ అయ్యాయి. తాజాగా.. ఇర్పిన్ నగరంలో ఉన్న కొద్ది మందికూడా అక్కడి నుండి వెళ్లిపోయారు.
అందులో డారియా అనే ఓ నాలుగేళ్ల చిన్నారి ఉంది. అయితే.. వారు ప్రయానిస్తున్న బస్సులోనే ఆ పాప పుట్టిన రోజును జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి తన కుమార్తె నాలుగో బర్త్‌డేను వేడుకగా చేయాలనుకున్నట్టు ఆ పాప తల్లి సుసన్నా సోపెల్నికోవా తెలిపారు.
కానీ.. రష్యా దాడుల వల్ల తమ ఇల్లు ధ్వంసమైందని కంటనీరు పెట్టుకున్నారు. ఇక ప్రాణాలు కాపాడుకోవడానికి ఇర్ఫిన్ నుంచి వెళ్లాల్సి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రష్యన్ క్షిపణి ఇర్పిన్‌లోని తమ ఇంటిని ధ్వంసం చేయడంతో.. ఇంటిని వదిలి పెట్టి పోరుగు ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
Advertisements
క్షిపణి దాడిలో ఇంటిపై కప్పు కూలిపోయిందని తెలిపారు. కరెంట్ లేదు..నీరు లేదు.. ఇంట్లో గ్యాస్ కూడా లేదని సుసన్నా ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే డారియా బర్త్ డేను ఘనంగా జరపాలనుకున్నామని.. ప్రాణాలను కాపాడుకునే భయంలో కొవ్వొత్తులు, కేక్ అన్ని ఇంట్లోనే వదిలివేయాల్సి వచ్చిందని సుసన్నా పేర్కొన్నారు.