ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. లేదంటే పోలీసులు తమ స్టైల్ లో భారీగా జరిమానాలు విధిస్తుంటారు. హెల్మెట్ వాడకం తప్పని సరిగా అవసరం అని చెప్తుంటారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తలకు గాయాలు కాకుండా రక్షణగా హెల్మెట్ దోహదపడుతోందని చెప్తున్నారు అధికారులు.
అయితే.. జరిమానాల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది నామమాత్రంగా హాఫ్ హెల్మెట్ ను ధరిస్తుంటారు. ఇలా హాఫ్ హెల్మెట్ ను ధరించడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదని అధికారులు చెప్తున్నారు. ప్రమాదాలు జరిగిన సమయంలో హాఫ్ హెల్మెట్ తో ముఖానికి దెబ్బతగిలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంతేకాదు.. తలకు కూడా తక్కువ మొత్తంలో గాయాలు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో హెల్మెట్ పెట్టుకున్నా ప్రయోజనం లేదని అభిప్రాయపడుతున్నారు. అయితే.. హెల్మెట్ వాడకంపై బెంగళూరు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో 15 రోజులపాటు హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ఆ తర్వాత హాఫ్ హెల్మెట్ ను బ్యాన్ చేయనున్నట్టు అక్కడి ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ.. ఎవరైనా హాఫ్ హెల్మెట్ వాడితే జరిమానాలు విధిస్తామని పోలీసులు చెప్తున్నారు. బెంగళూరు నగరంలో ఇకపై తప్పనిసరిగా పూర్తి హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనని అధికారులు హెచ్చరిస్తున్నారు.