భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య తిరిగి క్రికెట్ కొనసాగాలని, ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాలని పీసీబీ మాజీ ఛైర్మన్ తాకీర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పాక్‌తో ఆడేందుకు బీసీసీఐ ఎప్పుడూ తిరస్కరించలేదని ఆయన పేర్కొన్నారు. సమస్య.. రెండు దేశాల ప్రభుత్వాల మధ్య ఉంది కానీ.. రెండు క్రికెట్ బోర్డుల మధ్య లేదని వ్యాఖ్యానించారు. గంగూలీ, రమీజ్ రాజా.. ఇద్దరూ క్రికెట్‌ను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారని కొనియాడారు.
ప్రత్యర్థుల మధ్య పోటీని చూడటం కంటే గొప్పది మరొకటి లేదని తాకీర్ అభిప్రాయపడ్డారు. కాగా.. ఇటీవలే.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, పాకిస్థాన్‌లతో ఏటా నాలుగు దేశాల టీ20 టోర్నమెంట్ నిర్వహించాలన్న పాక్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా ప్రతిపాదనకు ఐసీసీ బోర్డు సమావేశంలో తిరస్కరించింది. దీంతో రమీజ్ రాజా తన ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే భారత్-పాక్ సిరీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేశారు తాకీర్.
ఇక పాక్-భారత్ సిరీస్ విషయానికొస్తే.. 2004లో సౌరభ్ గంగూలీ నేతృత్వంలోని టీమ్‌ఇండియా చారిత్రక పాకిస్థాన్ పర్యటనకు వెళ్లొచ్చింది. అప్పుడు భారత్ 2-1తో టెస్టు సిరీస్, 3-2తో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే 2005లో భారత పర్యటనకు వచ్చిన దాయాది జట్టు 3-2తో వన్డే సిరీస్ గెలుపొందగా టెస్టు సిరీస్‌ను డ్రాగా ముగించింది.
చివరగా 2013లో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక టీ20, వన్డే సిరీస్‌లు జరగ్గా.. పొట్టి సిరీస్ డ్రాగా ముగిసింది. వన్డే సిరీస్ 2-1 పాకిస్థాన్ కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో ఐసీసీ ఈవెంట్లలో తప్ప మరెక్కడా తలపడటం లేదు.