కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ మే 30 నుంచి జూన్ 14 వరకు వరకు భారీ ప్రజాప్రస్థానం ప్రచారం చేపట్టింది. రైతులు, మహిళలు, షెడ్యూల్డ్ కులాలు,షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీలపై దృష్టి సారించే ప్రచారంలో.. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలలో మంత్రులతో పాటు కేంద్ర మంత్రులందరూ ఈ ప్రచారంలో పాల్గొంటారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు.
రైతులు, మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలకు చేరువయ్యేందుకు ఒక్కో రోజు కేటాయించామని చెప్పారు. మే 30న, కరోనా మహమ్మారి సమయంలో అనాథలైన పిల్లలకు మోడీ చెక్కులను పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. మరుసటి రోజు హిమాచల్ ప్రదేశ్ గల సిమ్లాలోని రిడ్జ్ మైదాన్ నుండి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కార్యక్రమం ద్వారా.. దేశవ్యాప్తంగా ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారని స్పష్టం చేశారు.
మోడీ జూన్‌లో ధర్మశాలలో కూడా పర్యటించనున్నట్టు తెలిపారు. అక్కడ వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. ఈ ఏడాది చివరిలో గుజరాత్ తో పాటు.. హిమాచల్ ప్రదేశ్ లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయని అరుణ్ సింగ్ తెలిపారు. మోడీ నమ్మకమైన, ప్రజాదరణ, నిర్ణయాత్మక, త్యాగశీలి నాయకుడని, దేశం మొత్తం ఆయనకు అండగా నిలుస్తోందని కొనియాడారు.
మోడీ ప్రభుత్వం సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ ల సూత్రంపై పనిచేస్తోందని ప్రశంసలు కురిపించారు. ఈ ప్రచారంలో భాగంగా, బూత్ నుండి జాతీయ స్థాయి వరకు 75 గంటల ప్రజా సంబంధాల ప్రచారాన్ని కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులందరూ గ్రామాలను సందర్శిస్తారని సింగ్ చెప్పారు.