సింగరేణిలోని నల్లబంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగారం అన్నారు మంత్రి కేటీఆర్. సింగరేణి సంస్థను బలహీనపరిచి, నష్టపూరిత పబ్లిక్ సెక్టార్ కంపెనీగా మార్చి అంతిమంగా ప్రైవేటుపరం చేసే కుట్రను కేంద్ర సర్కారు అమలు చేస్తోందని ఆరోపించారు. నల్లచట్టాలతో రైతులను నట్టేట ముంచే కుట్ర చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు నల్ల బంగారంపై కన్నేసి సింగరేణిని నిలువునా దెబ్బతీసే కుతంత్రం చేస్తోందని విమర్శించారు. సింగరేణిలో ఉన్న జేబీఆర్ఓసీ-3, కేకే -6 , శ్రవణపల్లి ఓసీ, కోయ గూడెం గనులను సింగరేణి సంస్థకు కేటాయించకుండా.. వేలంలో పెట్టి ప్రైవేట్ పరం చేయాలనే కుట్ర లు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి సంస్థ అద్భుతంగా అభివృద్ధి ప్రస్థానంలో ముందుకు పోతోందని పేర్కొన్నారు. ఇలాంటి సంస్థను ఉద్దేశ్యపూర్వకంగా చంపే కుట్రకు కేంద్రం తెరలేపిందన్నారు. ఈ మేరకు కేంద్రం గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశారు. సింగరేణిలో గత ఏడేళ్లలో 450 లక్షల టన్నుల ఉత్పత్తి నుంచి 670 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగిందని పేర్కొన్నారు. అంతే కాకుండా బొగ్గు తవ్వకాలు, రవాణా, లాభాలు, కంపెనీ విస్తరణ విషయంలోనూ సింగరేణి గణనీయమైన ప్రగతిని సాధిస్తూ వస్తోందని మంత్రి అన్నారు.
సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న ధర్మల్ విద్యుత్ కేంద్రం దేశంలోనే అత్యుత్తమ పీఎల్ఎఫ్ ను కలిగి ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు భారీ ఎత్తున బొగ్గు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్ధ ఇవ్వని విధంగా 29 శాతం లాభాల్లో వాటాను ఇస్తున్న ఏకైక సంస్థ సింగరేణి మాత్రమేనని తెలిపారు.
సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రంలోని బీజేసీ సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ సింగరేణిని దెబ్బతీస్తే కేంద్రంలోని బీజేపీ కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయం అని హెచ్చరించారు. సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకుతుందన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఏడేళ్ల కాలంలో అద్భుతంగా అభివృద్ధి ప్రస్థానంలో ముందుకు పోతుందన్నారు.