ఆన్లైన్ గేమ్స్ మన యువత ప్రాణాలు తీస్తున్నాయి. పబ్ జీ, బ్లూ వేల్ గేమ్స్ మన పిల్లల ప్రాణాలను వెంటాడుతున్నాయి. తాజాగా బ్లూ వేల్ గేమ్ మహారాష్ట్రలో ఒక యువకుడి ప్రాణాలు తీసింది. మహారాష్ట్రలోని నాసిక్‌లో శుక్రవారం (డిసెంబర్ 31, 2021) 18 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం, బాలుడు ఆన్‌లైన్‌లో ‘బ్లూ వేల్’ గేమ్ ఆడుతున్నాడని ఆ గేమ్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు పేర్కొన్నారు.
ఈ గేమ్ కారణంగా గతంలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ లోని గైక్వాడ్ ప్రాంతంలో శవమై కనిపించాడు 18 ఏళ్ల తుషార్ జాదవ్. అతను ఫినైల్ తాగి మణికట్టు కోసుకున్నాడని పోలీసులు అంటున్నారు. ‘బ్లూ వేల్’ గేమ్ కారణంగా గత ఏడాది భారతదేశంలో అనేక మరణాలు నమోదయ్యాయి. ఈ గేమ్ దాదాపుగా 50 రోజుల పాటు ఆడే వాళ్ళను తన గ్రిప్ లో ఉంచుకుంటుంది. కంట్రోలర్ ఇచ్చిన టాస్క్‌లను పూర్తి చేయమని గేమ్ లో చెప్పడంతో వాళ్ళు కూడా వెనుకా ముందు ఆలోచన లేకుండా చేస్తూ ఉంటారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు… తల్లి తండ్రులను కూడా విచారిస్తున్నారు. ఈ గేమ్ కి సంబంధించి భారత ప్రభుత్వం నిషేధం విధించాలనే డిమాండ్ లు వినపడుతున్నాయి. ఇక తల్లి తండ్రులు తమ పిల్లలను ఈ గేమ్ భారి నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా సరే పిల్లలు మాత్రం ఈ గేమ్ కి బానిసలు గా మారిపోతున్నారు.