ముంబైలోని ఒక ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. దీంతో దట్టంగా మంటలు,పొగలు వ్యాపించాయి. ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులు ఈ మంటలు, పొగల్లో చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ముండేగావ్ సమీపంలోని జిందాల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 11 గంటలకు కర్మాగారంలోని ఒక బాయిలర్ భారీ శబ్ధంతో పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు, పొగలు చెలరేగాయి. ప్లాంట్ లో పని చేసే పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.
ఇక సమాచారం అందుకున్న వెంటనే పలు అగ్నిమాపక వాహనాలు ఆ ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సుమారు 11 మంది కార్మికులను రక్షించినట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు. చాలా మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు చెప్పారు.
బాయిలర్ పేలుడుకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరో వైపు జిందాల్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడుతో సమీపంలోని సుమారు 25 గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉవ్వెత్తున్న ఎగసిపడిన మంటలు, పొగలు చాలా దూరం నుంచి కనిపించాయి. దీంతో కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇంకా ఎంత మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారనేది తెలియాల్సి ఉంది.