– కొంగర్ ఖుర్ద్ లో మహిళల తడాఖా
– బౌన్సర్స్ ని ఉరికించి కొట్టిన వైనం
– 58 ఎకరాల కబ్జా ప్లాన్ కు చెక్
– బడా స్కాంని బయటపెట్టిన తొలివెలుగు
– రాజకీయంగా వాడుకునే పనిలో బీజేపీ
– టైటిల్ దిశగా అడుగులు పడని పోరాటం
– వక్ఫ్ బోర్డు పేరుతో ఇంకా ఎన్ని కబ్జాలో..!
క్రైంబ్యూరో, తొలివెలుగు: బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూముల కబ్జాలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆడా.. ఇడా అనే తేడా లేకుండా ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా పెట్టేస్తోంది మాఫియా. కొన్నింటి వెనుక బడా నేతల హస్తం కూడా ఉంటోంది. అలా.. కొంగర్ ఖుర్ద్ కబ్జా బాగోతం బయటపడింది. ధరణి అంటూ అనుభవదారుని కాలాన్ని ఎత్తివేసి.. అందినకాడికి దోచుకోండి అని డోర్లు తెరిచారు కేసీఆర్. 20 ఏళ్లకు ఒకసారి రివ్యూ చేయాల్సిన భూములు.. 90 ఏళ్లు అయినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. జాగీర్ దార్ చట్టం రద్దయినా.. కౌలుదారు చట్టం వచ్చినా.. అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ అమల్లో ఉన్నా.. ఇంకా వేల ఎకరాలు ఉందని చెప్పుకోవడం నయా నిజాంలను తలపిస్తోంది. వక్ఫ్ అనే ఒక్కపేరుతో వేల ఎకరాలు వివాదాస్పదమయ్యాయి.
రావిర్యాలలో రచ్చ రచ్చ!
తొలివెలుగు క్రైంబ్యూరో ఇన్వెస్టిగేషన్ కథనంతో కబ్జాదారులు విలవిలలాడుతున్నారు. 58 ఎకరాల్లో దొంగ ఓనర్ షిప్ లు పొంది ఎలా కబ్జాలకు పాల్పడుతున్నారో పూసగుచ్చినట్లు వివరించాం. 600 ఎకరాలపై కన్నేసి 200 ఎకరాలను ఎలా చేజిక్కించుకోవాలని చూశారో, వారి వెనుక ఉన్న పెద్దల పాత్రపై బాధితుల బాధను వివరించాం. రూ.4 వేల కోట్ల విలువ చేసే 600 ఎకరాలపై న్యాయపోరాటం చేయాల్సింది పోయి, దాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ఇప్పుడు బీజేపీ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
2007లో గెజిట్ ను రద్దు చేసేలా పోరాటం చేయాల్సింది పోయి, మరింత రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నట్టు వినికిడి. భూముల వద్దకు మహేశ్వరం బీజేపీ నేత శ్రీరాములు వెళ్లడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. దొంగ ఓఆర్సీలపై ఉద్యమం చేయాల్సిందిగా ప్రజలు నేతలను వేడుకుంటున్నారు. అసలు ఎన్ని ఓఆర్సీలు ఇచ్చారో గుట్టు రట్టు చేయాల్సిన నేతలు దాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నట్టుగా అనిపిస్తోందని అంటున్నారు.
మహిళల పోరాటం!
60 ఏండ్లుగా దున్నుకుంటున్న భూములపై కబ్జాదారుల దృష్టి పడింది. కోర్టుల్లో తప్పుడు సమాచారం ఇచ్చి ఇతర కంపెనీలకు రిజిస్ట్రేషన్ చేయించారు. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన వాళ్లు భూముల దగ్గర బౌన్సర్స్ ను పెట్టుకుంటున్నారు. దీంతో కడుపు కాలిన మహిళలు వారిని ఉరికించి వెంటబడ్డారు. భూమలో నుంచి బయటకు తరిమి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
తొలివెలుగు కథనంతో కదలికలు హైదరాబాద్ లోని మిస్రి దర్గాకు కొంగర్ ఖుర్ద్ లో ఉన్న భూములకు లింకులు ఎలా కుదిరిందో ఆరా తీసింది తొలివెలుగు క్రైంబ్యూరో.
జాగీర్ దార్ వ్యవస్థ రద్దయినప్పటికీ వారు ముతావలీకి ఇచ్చిన భూములు రికార్డుల్లో అలాగే ఉన్నాయి. పైసలపట్టిలో అక్రమంగా కొనసాగిన వ్యవహారంపై 1971లోనే భూములు రైతులకే చెందుతాయని ఓ.ఎస్.16/1971లో రంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చింది. ఎక్స్ పార్టీ తీర్పు అని చెప్పుకున్నా 60 ఏండ్లుగా సాగుచేసుకున్న వారికి రెగ్యులరైజేషన్ చేయకపోవడంపై న్యాయ నిఫుణుల అభిప్రాయం తీసుకుంది.
1989లో ఇచ్చిన గెజిట్ ఏంటి? సర్వేయర్ కమిషనర్ కృష్ణారావు సర్వే.. కాంగ్రెస్ లీడర్స్ కి అనుకూలంగా ఎలా? ఔటర్ రింగ్ రోడ్డు భూ మాఫియా ఎంటో.. పూర్తిగా ఆరా తీస్తోంది తొలివెలుగు క్రైంబ్యూరో. అయితే.. కొంతమందికి దొంగ ఓనర్ షీప్ లు ఇవ్వండి.. వారు మాత్రమే లే-అవుట్ అనుమతులు తీసుకోవడం వెనుక జరుగుతున్న వ్యవహారం బట్టబయలు చేయడంతో మహేశ్వరంలో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.