పెద్దలు చెప్పే ప్రతీ సామెతకు ఏదో ఒక కథ ఉంటుందంటారు. అందుకు తగ్గట్టు జరిగిన సన్నివేశాలను చూసినప్పుడు అది నిజమే అనిపిస్తుంది. అందులో కొన్ని వింతలు కూడా జరుగుతుంటాయి. అవి వినడానికి విచిత్రంగా, ఆశ్చర్యంగానూ అనిపించినప్పటికీ.. కొన్ని సార్లు నమ్మక తప్పదు. ఇప్పుడు అలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది.
కోతికైనా గీత సక్కగుండాలంటారు పెద్దలు. అది వింటే నిజమే అనిపిస్తోంది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఆశ్చర్యపరిచే ఘటన జరిగింది. భవనం మూడో అంతస్తు నుంచి కిందపడినప్పటికీ.. ఎలాంటి ప్రమాదం జరగలేదు.
నాసిక్ జిల్లాలోని చాందినీ చౌక్ అల్సానా అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులోని ఇంటి బాల్కనీలో ఫైజాన్ సద్దాం షేక్(3) అనే బాలుడు ఆడుకుంటున్నాడు. ఆడుతూ.. ఆడుతూ.. గ్రిల్ నుంచి జారి మూడో అంతస్తుపై నుండి కిందపడ్డాడు.
గమనించిన తల్లిదండ్రులు.. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఫైజాన్కు ఎలాంటి గాయాలు కాకపోవడం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే.. బాలుడు మామూలు అదృష్టజాతకుడు కాదంటు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే.. వైద్యులు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.