రంగరంగ వైభవంగా తొమ్మిది రోజుల పాటు సాగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణతో ముగిశాయి.అంతకుముందు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు.
ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీవారి పుష్కరిణిలోని వరహా స్వామి మండపం వద్ద శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగిశాయి. శ్రీవారి పుష్కరిణిలో ఉదయం 9 గంటలకు సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీజలంలో ముంచి, స్నానం చేయించారు.
రెండేళ్లుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూడలేకపోయిన వెంకన్న భక్త గణం ఈ ఏడాది జరిగిన బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా వేసిన టీటీడీ అందుకనుగుణంగానే ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాల నిర్వహణ ఎలాంటి విఘ్నాలు లేకుండానే పూర్తి అయ్యాయి.
టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగం, పోలీసులు, శ్రీవారి సేవకుల సమిష్టి కృషి, భక్తుల సహకారంతోనే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయని వైవి.సుబ్బారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.