ప్రతి ఒక్కరి జీవితం లో పెళ్ళికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంటుంది. అటువంటి పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టడానికి అయినా వెనుకాడరు కొందరు. ఎంతో స్పెషల్ గా చేసుకోవాలనుకుంటారు. వీటి అన్నిటితో పాటు వచ్చే అతిధులకు ప్రత్యేకమైన మర్యాదలు చేస్తుంటారు.
ఈ పెళ్లిని విభిన్నంగా చేసుకోవాలని కొందరు ఆలోచిస్తారు. అలాంటి వారు గాలిలో, నీటిలో,సముద్రం మధ్యలో ఇలా వినూత్నంగా అలోచించి చేసుకునే వారు ఉన్నారు. మరి కొంత మంది 5 రోజుల పెళ్లి అంటూ చేసుకుంటున్నారు.
పెళ్ళికి బంధువులని తీసుకుని వెళ్ళడానికి కొందరు కార్లు, మరికొందరు బస్సులు ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ పాతబడ్డాయనుకున్నారేమో రాజస్థాన్‌కు చెందిన ఓ జంట మరింత వైవిధ్యమైన ఆలోచన చేసింది. అతిథులను తీసుకెళ్లేందుకు ఏకంగా విమానం బుక్ చేసింది. ఆ ఫ్లైట్లో బంధువర్గమంతా కలిసి ప్రయాణిస్తూ.. సందడి చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విమానంలో వధూవరులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
డిజిటల్ క్రియేటర్ శ్రేయా సాహ్ షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన ఈ పెళ్లికి వధువు, వరుడి తరఫు బంధువులను తీసుకెళ్లేందుకు విమానాన్ని బుక్ చేశారు. ఈ రీల్‌ను ఇప్పటికే కోటి మందికి పైగా వీక్షించారు.
బంధువులకు విమానాన్ని ఏర్పాటు చేసిన మొదటి జంట ఇదే అయ్యి ఉండొచ్చు.
‘మీరు ధనవంతులు అని చెప్పకుండా రిచ్ అని చెప్పండి (Tell me you are rich without telling me you are rich)’ అంటూ ఓ యూజర్ చేసిన కామెంట్ మరో రకమైన చర్చకు తావిచ్చింది. రిచ్‌నెస్ అనేది డబ్బు, దర్పం చూపించుకోవడంలో ఉండదని, మనం చేసే పనుల్లో ఉంటుందనే అర్థంతో అతడు ఆ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది.
‘నా బంధువులు ఇంతటి మర్యాదలకు అర్హులు కారు’ అంటూ మరొక యూజర్ కామెంట్ చేశారు. ‘ఆ ప్రయాణీకులందరూ పెయిడ్ ఆర్టిస్ట్’ అంటూ ఇంకో యూజర్ విమర్శించాడు. ‘పెళ్లిలో వడ్డించిన వంటలు, వధువు డ్రెస్సు, వరుడి ఉద్యోగం గురించి చెడుగా మాట్లాడకుండా.. భారతీయ వివాహాలు అసంపూర్ణంగా ఉంటాయి’ అంటూ మరొక నెటిజన్ చమత్కరించడం కొసమెరుపు.