కట్నం సరిపోలేదని తాళి కట్టడానికి కొన్ని క్షణాల ముందు పెళ్లి పీటలపై నుంచి పెళ్లికొడుకు లేచి వెళ్లిపోయిన సంఘటనలు ఎన్నో చూశాం. కాని అదే సీన్ రివర్స్ అయితే. వినడానికి నమ్మశక్యంగా లేదు కదా.. కాని ఓ పెళ్లిలో మాత్రం ఇలా సీన్ రివర్స్ అయిన ఊహించని ట్విస్ట్ ఇచ్చి ఆగిపోయింది. మరో గంటలో పెళ్లి జరగనుండగా.. తనకు ఎదురుకట్నం సరిపోలేదని.. ఓ వధువు పెళ్లికి నో చెప్పింది. దీంతో పెళ్లి పీటల వరకు కూడా వెళ్లకుండానే పెళ్లి ఆగిపోయింది.
ఈ ఇంట్రెస్టింగ్ సంఘటన డీటైల్స్ లోకి వెళితే.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడికి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతితో వివాహం కుదిరింది. అమ్మాయికి ఎదురుకట్నం కింద రెండు లక్షల రూపాయలు ఇచ్చేందుకు పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య అంగీకారం కుదిరింది. దీంతో ఈ నెల 9 రాత్రి 7 గంటల 21 నిమిషాలకు వివాహం ముహూర్తం నిశ్చయించారు.
ఘట్కేసర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో వివాహం జరుగుతుందని అబ్బాయి కుటుంబ సభ్యులు ఆహ్వాన పత్రిక బంధుమిత్రులకు ఇచ్చి ఆహ్వానించారు. ముహూర్తానికి ముందే అబ్బాయి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆ ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. అయితే ముహూర్తం సమయం దగ్గర పడుతున్నా అమ్మాయి రాకపోవడంతో అబ్బాయి కుటుంబసభ్యులు ఏమైందని ఆరా తీశారు.
పెళ్లికూతురు అబ్బాయి వాళ్లు ఇచ్చే కట్నం సరిపోలేదని అదనపు కట్నం కావాలని డిమాండ్ చేసింది. తను డిమాండ్ చేసే కట్నం ఇవ్వకపోతే పెళ్లి క్యాన్సిల్ చేస్తానని తెగేసి చెప్పింది. ఏం చేయాలో పాలుపోని వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు వధువు కుటుంబ సభ్యులను స్టేషన్ కు పిలిపించారు.
అనంతనం అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది.పోలీసులు వారిని మందలించి ఇరు కుటుంబ సభ్యులు రాజీకుదిర్చేందుకు ప్రయత్నించినా వారు దానికి ససేమిరా అన్నారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. బంధువులతో కళకళలాడాల్సిన కల్యాణ మండపం కాస్త వెలవెలబోయింది. అయితే ఇలాంటి రీజన్ తో ఓ పెళ్ళి ఆగిపోవడంతో ఇది స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.