సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస పోయిన ప్రజలు, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వెళ్లిన వారు తిరిగి తమ సొంతూరు చేరుకుంటారు. సంక్రాంతి పండుగ రోజున బంధుమిత్రులతో ఎంతో ఆనందంగా గడుపుతుంటారు. ఈ నేపథ్యంలో సొంతూరు వెళ్లేవారితో హైదరాబాద్ లోని అన్ని ఆర్టీసీ బస్టాండ్ లు కిక్కిరిసిపోయాయి. ఎక్కడా చూసిన ప్రయాణికుల రద్దీ కంటి నిండా కనబడుతోంది. బస్టాండ్ లు, రైల్వే స్టేషన్ లు ప్రయాణికులతో కిక్కిరిస్తున్నాయి.
ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్ సుఖ్‌నగర్, ఎల్బీనగర్ బస్టాండ్ లు ప్రయాణికులతో నిండిపోయాయి. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులతో పాటు సొంత వాహనాల్లో జనాలు సొంతూళ్లకు బయలు దేరారు. దీంతో విజయవాడ రూట్ లో పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. రైల్వే స్టేషన్ లు కూడా ప్రయాణీకులతో నిండిపోయాయి. ఆంధ్రతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే వారితో రైల్వే స్టేషన్ లు కళకళలాడుతున్నాయి.
కోవిడ్ ఉధృతి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాణ సమయంలోనూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా.. ఆర్టీసీ బస్సులో మాస్క్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికులకు రూ.50 ఫైన్ వేస్తున్నారు అధికారులు. అయితే.. పండగ సంబరాల్లో మునిగిపోయి ప్రజలు అజాగ్రత్తగా ఉండొద్దని అధికారులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలని చెప్తున్నారు.