శ్రీశైలం లోయలో ఆర్టీసీ బస్సు పడబోయింది. అదృష్టవశాత్తు క్షణంలో పెను ప్రమాదం తప్పింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలోకి పడబోయింది. ఏపీలోని కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు కుడిగట్టు ఘాటు రోడ్డుపై మలుపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికుల సమాచారం ప్రకారం..మహబూబ్ నగర్ డిపోకు చెందిన టీఎస్ 06 UD 0376 బస్సు శ్రీశైలం నుంచి తిరిగి వస్తుండగా ప్రాజెక్టు సమీపంలో ఘాట్ రోడ్డుపై అదుపు తప్పింది.ఈ క్రమంలో ఘాట్ రోడ్డుపై రక్షణగా ఏర్పాటు చేసిన గోడను మలుపు వద్ద బస్సు ఢీ కొట్టింది. బస్సును అదుపు చేసేందుకు డ్రైవర్ ప్రయత్నం చేసినప్పటికీ.. కంట్రోల్ కాలేకపోయింది.
అయితే అదృష్టవశాత్తు రక్షణ గోడకు ముందు భాగంలో ఏర్పాటు చేసిన ఇనుప రాడ్లు లోయలోకి పడిపోకుండా కాపాడినట్లు స్థానికులు తెలిపారు. అదే క్రమంలో బస్సు ఆగిపోయిందని వారు వాపోయారు. బస్సులో సుమారు 30 మందికి పైగా ఉన్నారని తెలిపారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు బస్సు ఆగిన వెంటనే ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరుగులు తీశారు.