హైదరాబాద్ నగరంలో రోడ్డుప్రమాదాలకు అడ్దుకట్ట వేయలేకపోతున్నారు పోలీసులు అధికారులు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా అమాయకులు బలవుతున్నారు. ఇటీవలి కాలంలో వరుస కారు ప్రమాదాలతో అనేక మంది ప్రాణాలను కోల్పోయారు.
తాజాగా.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద మరో కారు బీభత్సం సృష్టించింది. టీఎస్08హెచ్ జే 6665 నెంబర్ గల కారు అతివేగంగా వచ్చి ఆటో, రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా.. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు. నిర్లక్ష్యంగా మద్యం మత్తులో వాహనాలు నిడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఖాకీలు.