గిరిజన వర్శిటీ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో గిరిజన యూనివర్శిటీ ప్రతిపాదన లేదని పార్లమెంట్ లో మోడీ సర్కార్ చెప్పడం దుర్మార్గమన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర మంత్రి అబద్దం చెప్పారని ధ్వజమెత్తారు.
గతంలో గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు పరిశీలనలో ఉందని పార్లమెంట్ లో చెప్పారని గుర్తు చేశారు. ఈ యూనివర్శిటీ ఏర్పాటు కోసం ములుగులో రాష్ట్ర ప్రభుత్వం భూమిని సైతం ప్రతిపాదించిందన్నారు. అయినా ఇప్పటికీ తెలంగాణలో గిరిజన యూనివర్శిటీని కేంద్రం ఏర్పాటు చేయలేదని విరుచుకుపడ్డారు. ఈ వర్శిటీ కోసం రాష్ట్ర సర్కార్ పలుమార్లు కేంద్రాన్ని కోరిందని పేర్కొన్నారు.
కేంద్రం తెలంగాణ పై విషం కక్కుతోందని విమర్శించారు. ఇదే సమయంలో.. రేవంత్ రెడ్డి పై కూడా సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. రేవంత్ కి సత్తా ఉంటే కేంద్రంతో కొట్లాడాలని ఛాలెంజ్ చేశారు. సమ్మక్క,సారలమ్మ మేడారం అభివృద్ది గురించి మాట్లాడే హక్కు రేవంత్ కి లేదన్నారు. ములుగును గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. నీ పార్టీ పాతాళంలోకి వెళ్లకుండా కాపాడుకోవాలని రేవంత్ ని సూచించారు.
నీతో నడుస్తున్న ఆ నలుగురు కూడా ఎన్నికల దాకా ఉండేలా చూసుకో అని చెప్పారు. కాగా.. తెలంగాణ సర్కార్.. సర్కార్ బడుల అభివృద్ధికి 7200 కోట్లు మంజూరు చేసిందని ఇటీవల సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మనసు పెట్టి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తోందని, విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
మన ఊరు మన బడి మొదటి విడుతలో ప్రతి మండలానికి నాలుగు పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా అభివృద్ధి చేశామని తెలిపిన ఆమె.. రానున్న మూడేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులు కల్పిస్తామన్నారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు తాగునీటితో పాటు మరుగు దొడ్లు,కిచెన్ షెడ్ ల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు.