తెలంగాణలో విద్యా వికాసానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రానికి కొత్తగా విద్యా సంస్థలను మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో నవోదయ విద్యాలయాలు, కరీంనగర్ లో ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి పలు విద్యా సంస్థలు మంజూరు చేయాలని తెలంగాణ ఎప్పటి నుంచో కోరుతోందని తెలిపారు. అయినా వాటిని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుందని ఆరోపించారు.
రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా.. విద్యా సంస్థల మంజూరులో తమతో కలిసి రావడం లేదని వినోద్ కుమార్ ఆరోపించారు. ఈ విషయంలో కనీసం వారు సొంతంగా అయినా ఎలాంటి ప్రయత్నాలు చేయడడం లేదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎంపీల వైఖరి ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని విమర్శించారు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో రాష్ట్రం కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలను ఏర్పాటు చేసిందని అన్నారు.
అయితే.. కొత్త జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. కానీ.. అందుకు కేంద్రం స్పందించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో హైదరాబాద్ లో తప్ప 9 ఉమ్మడి జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఎక్కడ లేవన్నారు. నిబంధనల ప్రకారం.. మరో 23 నవోదయ విద్యాలయాలు రావాల్సి ఉందని తెలిపారు. కొత్త నవోదయాలు వస్తే ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు మేలు జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి వల్ల చాలా మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు వైఎస్ఆర్ టీపీ నాయకురాలు షర్మిల రైతు బీమా విషయంలో అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని వినోద్ కుమార్ ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఎల్ఐసీని ఒప్పించి రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. కేంద్రం, వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న బీమా పథకాలు అన్నీ 60 ఏళ్ల లోపు ఉన్న వారికే వర్తిస్తున్నాయన్న విషయం శర్మిలకు తెలియదా అని ప్రశ్నించారు. ఇంత గొప్ప పథకాలను మెచ్చుకోవాల్సింది పోయి విమర్శించడం సరికాదని వినోద్ కుమార్ అన్నారు.