కేంద్ర ప్రభుత్వంపై మంత్రి సత్యవతి రాథోడ్ నిప్పులు చెరిగారు. తెలంగాణ పై కేంద్రం కక్ష సాధింపు చర్యలు చేస్తోందని ఆరోపించారు. గ్యాస్ ధరలు సైతం అమాంతం పెంచేశారని మండిపడ్డారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ.. ఒకప్పుడు మహిళలకు సమాన హక్కులు ఉండేవి కావని, ఓటు హక్కు కూడా లేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. ఏ ఇతర రాష్ట్రాల్లో లేవన్నారు. మహిళలకు.. ముఖ్యంగా గర్భవతి సమయంలో పౌష్టికాహారం అందించడంతో పాటు డెలివరీ తర్వాత కేసీఆర్ కిట్ అందిస్తున్నామని తెలిపారు.
మహిళల గురించి ఒక అన్నగా, ఒక తండ్రిగా ఆలోచించే వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టమన్నారు. మహిళలకు బతుకమ్మ చీరలు సైతం కేసీఆర్ ప్రభుత్వం పంచిందని చెప్పుకొచ్చారు. అంతకుముందు.. తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు,రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని సత్యవతి రాథోడ్ అన్నారు.
రాబోయే రోజుల్లో కేసీఆర్ దేశంలోనే గొప్ప నాయకుడిగా అవతరిస్తారని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంచేలా పోలీసులు పనిచేస్తున్నారని.. వీరు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు.