తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న రాష్ట్ర నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. తుది మెరుగులు దిద్దుకుంటున్న నూతన సచివాలయ పనులను శుక్రవారం అధికారుల బృందంతో కలిసి కేసీఆర్ పరిశీలించారు. చివరి దశలో ఉన్న నిర్మాణ పనులను నిశితంగా పరిశీలించిన కేసీఆర్..అధికారులకు పలు సూచనలు చేశారు.
సీఎం కేసీఆర్ వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, పలువురు అధికారులు, బీఆర్ఎస్ నేతలున్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 17న ప్రారంభం కావాల్సిన తెలంగాణ నూతన సచివాలయం కొన్ని కారణాల వల్ల ఆగిపోగా.. సెక్రటేరియట్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావడంతో ఏప్రిల్ 14న నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
మరో వైపు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో సచివాలయ ప్రధాన ద్వారం, లోపలి ద్వారంపై బంగారపు పూతతో కూడిన రాష్ట్ర చిహ్నాన్ని బిగించారు. రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళాతోరణం, దానిపైన మూడు సింహాలు, లోపల చార్మినార్, తెలంగాణ ప్రభుత్వము అని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషులో ఉన్న విషయం తెలిసిందే.