తెలంగాణ రాష్ట్రాన్ని చలి పులి వణికిస్తోంది. చాలా జిల్లాల్లో పొగ మంచు కమ్మేసింది. శనివారం ఈ పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఉదయం 8 అయినప్పటికీ ప్రజలు బయటకి రాలేకపోతున్నారు.
దీంతో రోజువారీ కూలీలు, విద్యార్థులు, రైతులు ఇబ్బందులు పడ్డారు. వివిధ పనుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు రోడ్డుపై దట్టమైన మంచు ఉండడంతో లైట్లు వేసుకుని ప్రయాణించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రత పెరగడంతో జన సంచారం తగ్గింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం ఎనిమిది గంటల వరకూ మంచు విపరీతంగా కురిసింది. మంచు తెరల మధ్య సూర్యుడు పున్నమి చంద్రుడులా కన్పించాడు.
చలి కారణంగా ప్రజలు గజగజ వణికారు. పొగ మంచు కురుస్తుండడంతో ఇళ్లను వదిలి బయటికి రాని పరిస్థితి. నాలుగైదు అడుగుల దూరంలో ఉన్న మనిషి కన్పించని పరిస్థితి నెలకొన్నది. ఇండ్లు, పంట పొలాలపై తెల్లటి తివాచీలా మంచు దుప్పటి కప్పుకోవడంతో పలువురు తమ సెల్‌ఫోన్లలో ఫొటోలు తీసుకున్నారు.