ములుగు జిల్లాలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య తీరు రోజురోజుకి చర్చనీయాంశంగా మారుతుంది. తాజాగా తన వాహనానికి పశువులు అడ్డొచ్చాయని ఓ పశువుల కాపరిపై కలెక్టర్ తన ప్రతాపాన్ని చూపించారు. పశువుల కాపరిపై చర్యలు తీసుకోవాలని కింది స్థాయి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు.
మంగపేట మండలం గంపో నిగూడేనికి చెందిన బోయిని యాకయ్య అనే వ్యక్తి పశువులను మేతకు తీసుకువెళ్తుండగా కలెక్టర్ వాహనానికి పశువులు అడ్డుగా వచ్చాయి. దీంతో యాకయ్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్.. అతని సెల్ ఫోన్ లాక్కొన్నారు. ఇక కలెక్టర్ ఆదేశాలతో యాకయ్య ఇంటికి వెళ్ళిన అధికారులు అతనికి జరిమానా విధించారు.
హరితహారంలో నాటిన మొక్కలను పశువులు నాశనం చేస్తున్నాయనే పేరిట యాకయ్యకు 7,500 జరిమానా విధించడమే కాకుండా నల్లా కనెక్షన్ కు తాత్కాలికంగా సీల్ వేశారు. కలెక్టర్ తీసుకున్న సెల్ ఫోన్ ను యాకయ్యకు పంచాయితీ కార్యదర్శి హీరు తిరిగి అందించారు.
అయితే ఇంతటితో ఆగని కలెక్టర్ జరిమానా కట్టకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించడంతో డబ్బులను యాకయ్య చెల్లించాడు. రోడ్డుకు ఇరు వైపులా.. నాటిన మొక్కలను పాడి పశువులు నాశనం చేస్తుండడంతో జరిమానా విధించామని కలెక్టర్ వెల్లడించారు. జరిమానా సొమ్మును పంచాయితీ ఖాతాలో జమ చేయాలని ఆదేశించామన్నారు. అయితే కలెక్టర్ తీరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సాధారణ పశువుల కాపరి పై కలెక్టర్ ప్రతాపం చూపించడం ఏంటని అందరూ మాట్లాడుకుంటున్నారు.