ఇంటింటి జ్వర సర్వేలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్. కరోనా మహమ్మారిని అరికట్టాలంటే ప్రతీ ఒక్కరు రెండు డోసుల టీకాలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్ టీకాతో వ్యాధినుండి రక్షణ పొందొచ్చునని వివరించారు. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యాధికారులను సంప్రదించాలని సూచించారు. ఏం కాదు అనుకొని అశ్రద్దగా వ్యవహరిస్తే ఒకరినుండి ఒకరికి వ్యాప్తి చెంది పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.
కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎనిమిది వార్డులలో మొత్తం 60 టీములను ఏర్పాటు చేసి సర్వే చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చేపట్టిన ఈ సర్వేలో ఇంటి వద్దకే ఆరోగ్యకార్యకర్తలు వచ్చి వివరాలు సేకరిస్తారని పేర్కొన్నారు. జ్వరం లాంటి లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి అక్కడే హోమ్ ఐసోలేషన్ కిట్లను అందచేయనున్నట్లు వెల్లడించారు. ఆరోగ్యకార్యకర్తలు ప్రతిరోజు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు.
అవసరమైతే దగ్గర్లో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తారని చెప్పారు. ఆరోగ్య సిబ్బందికి తోడుగా మున్సిపల్, పంచాయితీ శాఖ, ఆశా వర్కర్లు, అంగన్ వాడి వర్కర్లు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నట్టు తెలిపారు. ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు.
స్వీయ నియంత్రణే కరోన బారిన పడకుండా కాపాడుకునే ఉత్తమ మార్గమని అన్నారు. ప్రాథమిక చికిత్సా కేంద్రాలతో పాటు బస్తీ దవకానాలలో కూడా కోవిడ్ పరీక్షలు చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. అయితే.. కరోనా కట్టడిలో భాగంగా గురువారం మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆన్ లైన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.