- దిగజారుతున్న టీఆర్ఎస్ గ్రాఫ్
- కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో సీన్ రివర్స్!
- రానున్న ఎన్నికల్లో వ్యతిరేక పవనాలు
- అయోమయంలో అధికార పార్టీ నేతలు
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్లలో పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. అసలు కేసీఆర్ నేతృత్వంలో ఏర్పడిన టీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపలేదని అంతా అనుకున్నారు. ఇక అలా 2004లో కాంగ్రెస్ తో, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ కొన్ని సీట్ల వరకు గెలుచుకుంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం టీఆర్ఎస్ కు బాగా కలిసొచ్చింది. ఊహించని విధంగా 2014లో 60కి పైనే సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర స్థాయిలో బలం లేదని తేలింది.
దీంతో కేసీఆర్ అనూహ్యంగా టీడీపీని దెబ్బకొట్టి..ఆ పార్టీ నేతలని లాగేశారు. దీంతో టీడీపీ కేడర్ టీఆర్ఎస్ వైపునకు వచ్చింది.. అలాగే కాంగ్రెస్ ని కూడా నిదానంగా దెబ్బకొడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే 2018 ఎన్నికల్లో భారీ విజయం సాదించింది టీఆర్ఎస్. అక్కడ నుంచి కాంగ్రెస్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి.. ఆ పార్టీని దెబ్బకొట్టారు. ఇలా టీడీపీ-కాంగ్రెస్ లని దెబ్బకొట్టి టీఆర్ఎస్ బలపడింది. అయితే, ఇక తిరుగులేదనుకునే సమయంలో అనూహ్యంగా బీజేపీ ఎదుగుతూ వచ్చింది..అలాగే కాంగ్రెస్ కూడా నిదానంగా పుంజుకుంటోంది.
దీంతో టీఆర్ఎస్ పార్టీకి అంతా రివర్స్ అయ్యే పరిస్థితి వచ్చింది… ఇప్పటివరకు బలపడుతూ వచ్చిన టీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతూ వస్తోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి మొదట నుంచి అండగా ఉంటూ వస్తున్న ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో సీన్ రివర్స్ అవుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రెండు జిల్లాల్లో టీఆర్ఎస్ మంచి ఫలితాలు రాబడుతోంది.
ఇక 2018 ఎన్నికల్లో నిజామాబాద్ లో క్లీన్ స్వీప్ చేయగా, కరీంనగర్ లో 13 సీట్లకు 12 సీట్లు గెలుచుకుంది. అంటే రెండు జిల్లాల్లో టీఆర్ఎస్ ప్రభావం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలా కంచుకోటలుగా ఉన్న జిల్లాల్లో కారు రివర్స్ అవుతోంది. రెండు జిల్లాల్లో బీజేపీ పుంజుకుంది…టీఆర్ఎస్ కు పోటీగా బీజేపీ ఎదిగింది. నిజామాబాద్ లో కారు పార్టీకి కమలం ధీటుగా పుంజుకుంది. అటు కరీంనగర్ లో కమలంతో పాటు కాంగ్రెస్ కూడా పికప్ అవుతోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి కారు కంచుకోటలు కూలే పరిస్థితులు ఏర్పడ్డాయి.