ఆటోలు, ప్రైవేట్ బస్సులు వద్దు , ఆర్టీసీ బస్సులే సురక్షితం అంటూ అధికారులు తెగ ప్రచారం చేస్తుంటారు. కానీ కొందరు కండక్టర్లు, డ్రైవర్లు మాత్రం ప్రయాణికుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తుంటారు. బస్సు ఎక్కేటప్పుడు కానీ, దిగేటప్పుడు కానీ వారి ఇష్టారీతిన మాట్లాడుతుంటారు. ఆ క్రమంలో కొందరికి గాయాలైన ఘటనలు కూడా ఉన్నాయి.
అందులోనూ వృద్ధుల పట్ల మరీ విపరీత ధోరణిలో ప్రవర్తిస్తుంటారు. వృద్ధుల విషయంలో నిదానంగా ప్రవర్తించాల్సింది పోయి అమానుషంగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే పల్నాడు జిల్లా లో చోటు చేసుకుంది. సత్తెనపల్లిలో ఓ వృద్ధురాలి పట్ల ఆర్టీసీ బస్సు కండక్టర్ అమానుషంగా ప్రవర్తించాడు.
వృద్ధురాలు బస్సు దిగే సమయంలో ఆమె పట్ల కండక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. త్వరగా బస్సు దిగాలంటూ వృద్ధురాలిని ఇబ్బంది పెట్టాడు. చివరకు తొందరగా దిగాలంటూ వృద్ధురాలిని బస్సు నుంచి తోసేశాడు. దీంతో సదరు వృద్ధురాలు హఠాత్తుగా కిందపడిపోయింది.
ఆమెను కనీసం పట్టించుకోకుండా బస్సు అక్కడి నుంచి వెళ్లిపోయింది. కిందపడిన వృద్ధురాలికి గాయాలవడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కండక్టర్ తీరు పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు