మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు ఎంత సంచలనం రేపిందో చూశాం. అరెస్ట్ అయిన వారి కుటుంబసభ్యులు ఇది పక్కా అక్రమ కేసని అంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం అదే చెబుతున్నారు. అఫిడవిట్ విషయంలో కోర్టును ఆశ్రయించడం వల్లే మర్డర్ కేసును తెరపైకి తెచ్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి అవిఫిడవిట్ పై పిటిషన్ వేసిన కారణంగా.. తమను తీవ్రంగా వేధించారని చెబుతున్నాయి బాధిత కుటుంబాలు. ఇంత జరిగినా కూడా తమపై ఇంకా ప్రతీకారం తీర్చుకుంటూనే ఉన్నారని అంటున్నాయి. తాజాగా రాఘవేంద్ర రాజు భార్య పేరిట ఉన్న భూమిలోని కంటైనర్ ను ఎత్తుకెళ్లారు దుండగులు.
వివరాల్లోకి వెళ్తే… మహబూబ్ నగర్ మున్సిపాల్టీ పరిధిలో ఉన్న ఏనుగొండలో రాఘవేంద్ర రాజు భార్య వసంత పేరిట 31 గుంటల భూమి ఉంది. ఐదేళ్ల క్రితం ఓ పెద్ద కంటైనర్ ను తీసుకొచ్చి అందులో ఉంచారు. ఆ భూమి తమదని కంటైనర్ కు బ్యానర్ కూడా అంటించారు. అయితే.. తాజాగా దాన్ని ఎవరో ఎత్తుకెళ్లిపోయారు.
బైపాస్ కు ఆనుకుని ఉన్న ఈ భూమిని కబ్జా చేయాలనే ప్లాన్ లో భాగంగానే కంటైనర్ ను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ల్యాండ్ కు సంబంధించిన పాస్ బుక్ వసంత పేరు మీదే ఉంది. ఓ లారీని తీసుకొచ్చి కంటైనర్ ను తీసుకెళ్లినట్లు కొన్ని వీడియోలు, ఫోటోలను మీడియాకు చూపించారు వసంత.