ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి నిరసన సెగ తగిలింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఒవైసీ కాన్వాయ్ ను ముస్లిం సంఘాలు అడ్డుకున్నాయి. ఓ ఇఫ్తార్ కార్యక్రమానికి వచ్చిన ఓవైసీకి నల్లజెండాలు చూపిస్తూ.. ఓవైసీ గో బ్యాక్, ఓవైసీ వాపస్ జావ్, ఓవైసీ బీజేపీ ఏజెంట్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ ఏడాది డిసెంబర్ లో గుజరాత్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఏఐఎంఐఎం కార్యకర్తలు, నేతలతో సమావేశం అయ్యేందుకు ఒవైసీ అహ్మదాబాద్ నగరానికి వచ్చారు. కారులో ఇఫ్తార్ కార్యక్రమానికి బయలుదేరుతుండగా.. పలువురు నల్లజెండాలు చేతబట్టుకుని ఆయన కాన్వాయ్ ను ముందుకు కదలనివ్వకుండా అడ్డంగా కూర్చున్నారు.
దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ పరిస్థితులు గందరగోళంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు.. మజ్లీస్ కార్యకర్తల సహాయంతో ఓవైసీ కాన్వాయ్ ను అక్కడ నుండి పంపించారు. ఎలాంటి అల్లర్లు జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.