ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ పేర్కొన్నారు. రెండేళ్లుగా కరోనా భూతం ప్రపంచంపై దాడి చేస్తోందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కేసులు కొంత తగ్గుముఖం పడుతున్నాయన్నారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయన్నారు.
అయితే.. అంతమాత్రాన ఊరట చెందొద్దని అన్నారు. కరోనా వైరస్ ప్రభావం దశాబ్దాలపాటు ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా వైరస్ సోకే ముప్పు ఉన్న సమూహాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. మహమ్మారి ఎంత సుదీర్ఘంగా ప్రబలితే దాని ప్రభావం కూడా అంతే స్థాయిలో ఉంటుందని తెలిపారు.
వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అసమానతలు కొనసాగుతున్నాయని అధనోమ్ ఆవేదన వ్యక్తం చేశారు. కామన్ వెల్త్ దేశాల్లో 42 శాతం మంది జనాభాకు రెండు టీకాలు అందాయని.. ఆఫ్రికా దేశాల్లో సగటు వ్యాక్సినేషన్ రేటు 23 శాతంగా మాత్రమే ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
టీకాల పంపిణీలో ఉన్న ఈ వ్యత్యాసాన్ని తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని అధనోమ్ పేర్కొన్నారు. రానున్న కాలంలో వేరువేరు వేవ్ లలో కరోనా ప్రభలడానికి అవకాశాలున్నాయన్నారు. ఇంకా కొంత కాలం పాటు కరోనాతో గడపక తప్పదని అన్నారు. కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు అధనోమ్.