కరోనా వైరస్ వివిధ రూపాల్లో విడతల వారీగా ప్రపంచ దేశాలను కభలించేస్తోంది. ఇప్పటికే సెకండ్ వేవ్ డెల్టా వేరియంట్ రూపంలో అనేక మంది ప్రాణాలను మింగేసింది. మరోసారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో వణికించినప్పటికీ.. తొందరగానే తగ్గుముఖం పట్టింది. మరణాల సంఖ్య కూడా తక్కువగానే నమోదైంది. అయితే.. కరోనా కారణంగా మరణించిన వారిలో వైరస్ వ్యాప్తి ఎంత కాలం సజీవంగా ఉంటుందనేది మాత్రం ఎవరికీ అంతు పట్టని విషయం. దానిపై అనేక పరిశోదనలు జరిగాయి. కానీ.. ఎవరు కనిపట్టలేక పోయారు.
తాజాగా దానిపై ఇటలీకి చెందిన వైద్యులు పరిశోదనలు చేశారు. అందులో భాగంగా కీలక విషయాలు వెల్లడించారు. మృతదేహాల్లో 41 రోజుల వరకు కరోనా వైరస్ బతికి ఉండే అవకాశం ఉంటుందని తేల్చి చెప్పారు. అయితే.. మృతదేహాల నుంచి ఇతరులకు కొవిడ్ వ్యాపిస్తుందా లేదా అనేది నిర్ధారించేందుకు మాత్రం మరిన్ని అధ్యయనాలు జరగాల్సి ఉందని స్పష్టం చేశారు వైద్యులు.
అయితే.. ఉక్రెయిన్ కు చెందిన 41 ఏళ్ల వ్యక్తి.. కొంతకాలం క్రితం ఇటలీలోని చీటీ వద్ద స్నేహితుడితో కలిసి బీచ్ కు వెళ్లాడు. సముద్రంలో ఈత కొడుతూ మునిగిపోయాడు. 16 గంటల తర్వాత అతడి మృతదేహం సముద్రంలోని రెండు బండరాళ్ల మధ్య చిక్కుకుని కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు.
చనిపోవడానికి ముందు ఆ వ్యక్తికి ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవు. అయినా.. ఇటలీ ప్రభుత్వ కొవిడ్ నిబంధనల ప్రకారం శవపరీక్షకు ముందు కరోనా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేశారు. పాజిటివ్ అని తేలింది. అంత్యక్రియల నిర్వహణకు అనుమతులు రానందున.. ఆ వ్యక్తి మృతదేహాన్ని సీల్ చేసి, 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఆస్పత్రి మార్చురీలో భద్రపరచాల్సి వచ్చింది. ఆ సమయంలో డి అన్నున్ జియో విశ్వవిద్యాలయ వైద్యులు.. ఆ శవానికి వరుసగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశారు.
అయితే.. 41 రోజుల్లో 28సార్లు సాంపిల్స్ తీసి పరీక్షించారు. ప్రతిసారీ పాజిటివ్ అనే ఫలితం వచ్చిందని వారు వెల్లడించారు. ఆ తర్వాత అంత్యక్రియలు జరపడం వల్ల కరోనా టెస్టు చేయడం కుదరలేదని తెలిపారు. మృతదేహాల నుంచి కరోనా వ్యాప్తిపై ఇప్పటికే అనేక పరిశోధనలు జరిగాయి. కానీ.. ఎక్కడా శవాల నుంచి కొవిడ్ వ్యాప్తి చెందినట్లు తేలలేదని వైద్యులు తెలిపారు. మృతదేహాల్లో కరోనా ఎంతకాలం సజీవంగా ఉంటుందన్నదానిపైనా ఇంత వరకు స్పష్టత లేదన్నారు.
గతంలో జర్మన్ పరిశోధకులు ఇదే విషయంపై అధ్యయనం చేశారని.. పోస్ట్ మార్టం తర్వాత 35 గంటల వరకు వైరస్ శరీరంలో వృద్ధి చెందుతున్నట్లు తేల్చారని పేర్కొన్నారు. వస్తువులపై కరోనా సజీవంగా ఉండడంపై పరిశోధన చేసినా.. ఇలాంటి అస్పష్ట ఫలితాలే వచ్చాయని వెల్లడించారు. ఇప్పుడు తాము కనుగొన్న విషయాలు.. ఈ పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉపకరిస్తాయని చెప్తున్నారు ఇటలీ వైద్యులు.