శివసేన- కంగనా రనౌత్ ల మధ్య జరుగుతున్న దుమారం ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతికి డ్రగ్స్ లింకులు దొరకుతుండటం, ఆ అంశంలో కంగనా-శివసేనల మధ్య జరిగిన రచ్చ తెలిసిందే. అయితే తనను ముంబైలో అడుగుపెట్టనివ్వమని శివసేన చాలేంజ్ చేయటంతో కంగనా మనాలీ నుండి ముంబై వెళ్లింది. దీంతో ఆమెకు కేంద్రం వై-ప్లస్ కేటగిరి భద్రతను కేటాయిస్తూ నిర్ణయించింది.
అయితే, ముంబై నుండి తన స్వస్థలం వెళ్లిపోయిన కంగనాకు ఇక ఆ భద్రత ఎందుకు…? అందుకోసం నెలకు 10లక్షల ఖర్చు అవుతుంది. ఆ భారాన్ని ప్రజల పన్నుల ద్వారానే ఖర్చు చేస్తారుగా అంటూ సుప్రీంకోర్టు లాయర్ బ్రిజేష్ కల్ప ట్వీట్ చేశారు. మీరు సేఫ్ గా మీ సొంత ప్రాంతంకు వెళ్లిపోయాక, ఆ భద్రత అవసరమా అని ప్రశ్నించారు.
దీనిపై రియాక్ట్ అయిన కంగనా… బ్రిజేష్ గారూ మీరు, నేను అడిగితే కేంద్రం భద్రత కేటాయించదు. నిజంగానే ప్రాణాపాయం ఉంటే, ఐబీ అందుకు నివేదిక ఇస్తేనే భద్రత కేటాయిస్తారు. ఆ దేవుడి దయ ఉంటే భవిష్యత్ లో నాకు భద్రత తొలగించవచ్చు లేదంటే పెంచవచ్చు అని స్పష్టం చేసింది.
ఇక ముంబై నుండి మనాలీ చేరుకోగానే… నేను ప్రాణాలతో భయటపడ్డ ఫీలింగ్ కలిగింది, ఒకప్పుడు ముంబైలో ఉంటే నా సొంతింట్లో అమ్మ పక్కనే ఉన్నట్లుగా ఫీలయ్యేదాన్ని, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని కామెంట్ చేసింది.