జి-20 సమావేశాలకు దేశం నాయకత్వం వహిస్తుండటం చాలా గర్వంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తాజ్ కృష్ణలో స్టార్టప్ 20 ఇండియా సదస్సు ప్రారంభమైంది. స్టార్టప్ 20 సదస్సుకు జి 20 సభ్య దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. స్టార్టప్ కంపెనీల అభివృద్ధి, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో స్టార్టప్ సంస్థల సమన్వయంపై చర్చించనున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..జి 20 సమావేశాలకు దేశం నాయకత్వం వహిస్తుండడం గర్వంగా ఉందన్నారు. వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ ఇండియా నినాదమన్నారు. స్టార్టప్ 20 ఇన్సెప్షన్ సమావేశానికి హైదరాబాద్ ఆతిథ్యమివ్వడం ఆనందంగా ఉందన్నారు. యువతలో ఉన్న అభిరుచి, ఆసక్తి వల్లే మన దేశంలో స్టార్టప్ సంస్థలు విజయ పథంలో దూసుకెళ్తున్నాయన్నారు.
కొవిడ్ ను దేశం ఎలా ఎదుర్కొందో పొరుగు దేశాలు చూశాయని అన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ కోసం ఎన్నో విధానపరమైన నిర్ణయాలను తీసుకుంటుందన్నారు. స్టార్టప్ సంస్థల కోసం ప్రత్యేక నిధులు కేటాయించి ఇంక్యుబ్రేటర్స్ ను తీర్చిదిద్దమన్నారు. ఏడేళ్లలోనే మోడీ విజన్ వల్ల స్టార్టప్ సంస్థలతో దేశం పోటీపడగలిగిందని పేర్కొన్నారు.
అయితే 1999 లో జి 20 సదస్సు ప్రారంభమైనప్పటి నుండి భారత్ సభ్య దేశంగా ఉన్నప్పటికీ..2014 నుంచి ఈ శిఖరాగ్ర సమావేశాలకు భారత్ తరుపున ప్రధాని మోడీ పాల్గొంటూ వస్తున్నారు. జి 20 సభ్యదేశాల్లో ఉన్న ఓ దేశం ప్రతి ఏటా డిసెంబర్ లో సదస్సుకు అధ్యక్షత వహిస్తుంది.