హైదరాబాద్ లో క్రికెటర్ భోగి శ్రావణి ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఈ ఇల్లు కూలిపోయే దశలో ఉందని శ్రావణి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చిన జీహెచ్ఎంసీ అధికారులు.. ఇంటిని మరమ్మత్తులు చేసిన విషయం గుర్తించకుండానే కూల్చివేశారని శ్రావణి వాపోయారు. దీంతో తమ కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భోగి శ్రావణి కుటుంబం నివాసం ఉంటుంది. అయితే..ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ఆధారంగా ఇంటి వెనుక వైపు గోడను మరమ్మత్తు చేశారు. ఈ విషయాన్ని గుర్తించకుండానే జీహెచ్ఎంసీ అధికారులు తమ ఇంటిని కూల్చివేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా.. ఈ నెల 6న సాయంత్రం తమ ఇంటి వద్దకు వచ్చిన జీహెచ్ఎంసీ అధికారులు.. ఇంట్లోని సామానంతా బయటవేసి ఇంటిని కూల్చివేశారని ఆమె ఆరోపించారు. ఈ ఇంటిని కూల్చివేయడంతో తన తండ్రి మల్లేశంతో కలిసి సమీపంలోని కమ్యూనిటీ హాల్ లో తలదాచుకుంటున్నట్టు శ్రావణి పేర్కొన్నారు.
అదే ప్రాంతంలో తాము 35 ఏళ్లుగా నివాసం ఉంటున్నట్టుగా శ్రావణి తెలిపింది. జీహెచ్ఎంసీ అధికారులు దౌర్జన్యంగా తమ ఇంటిని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటిని కూల్చి, తమను రోడ్డు పడేలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ లో శ్రావణి ఫిర్యాదు చేశారు.
ఈనెల 15 నుంచి పుదుచ్చేరిలో జరిగే మహిళల టీ 20 టోర్నమెంట్ లో తాను పాల్గొనాల్సి ఉందని శ్రావణి తెలిపింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను క్రికెట్ ఆడాలా..? లేక తన ఇంటి కోసం పోరాడాలో తెలియట్లేదని శ్రావణి కంటనీరు పెట్టుకుంది.