అంతర్జాతీయ క్రికెటర్” ఇతర దేశాల్లో ఏమో గాని మన దేశంలో మాత్రం జాతీయ జట్టుకి ఆడితే చాలు… ఆ క్రికెటర్ లైఫ్ మారిపోతుంది. ఒకప్పుడు ఏమో గాని ఇప్పుడు మాత్రం క్రికెటర్ ఐపిఎల్ ఆడితే అతనికి వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కాదు. ప్రస్తుతం జాతీయ జట్టులో పాపులర్ అయిన ఎందరో ఆటగాళ్ళు కోట్లాది రూపాయల ఆస్తులను వెనకేస్తున్నారు. ప్రతిభతో క్రికెట్ లోకి అడుగు పెట్టి జాతీయ జట్టుకి ఆడుతూ సూపర్ రిచ్ అయిపోయారు. పూర్తిగా పేద కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు కోట్లాది రూపాయలను సంపాదించుకున్నారు. ఆ జాబితాలో ముందు వరుసలో ఉండే క్రికెటర్లను ఒకసారి చూద్దాం.
రవీంద్ర జడేజా: ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో రవీంద్ర జడేజా ఒకడు. అతని తండ్రి వాచ్‌మెన్‌గా పనిచేసేవాడు. ఇక చిన్న వయసులోనే తల్లిని కూడా కోల్పోయాడు జడేజా. అయినప్పటికీ, జడేజా ఎప్పుడూ పట్టు వదలలేదు మరియు 2008లో విరాట్ కోహ్లీతో కలిసి అండర్ 19 ప్రపంచకప్ ఆడిన జడేజా ఆ తర్వాత అతి కొద్ది కాలానికే జాతీయ జట్టులోకి వచ్చేసి ఆల్ రౌండర్ గా సెటిల్ అయిపోయాడు. మూడు ఫార్మాట్లలో అతను జట్టుకి కీలకంగా ఉన్నాడు.
మహేంద్ర సింగ్ ధోనీ: జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ధోనీ కూడా ఆర్ధికంగా చితికిపోయిన కుటుంబం నుంచి జాతీయ జట్టులోకి అడుగు పెట్టాడు. ఒకానొక దశలో ధోనీ పార్కింగ్ ప్లేస్ లో టికెట్ లు చెక్ చేసే ఉద్యోగానికి కూడా వెళ్ళే పరిస్థితి వచ్చింది. అయినా సరే ఏ మాత్రం క్రికెటర్ కావాలనే ఆశయాన్ని మాత్రం పక్కన పెట్టలేదు. గంగూలీ పుణ్యమా అని జాతీయ జట్టులోకి రావడం ఆ తర్వాత కెప్టెన్ కావడం రెండు ప్రపంచకప్ లు గెలవడం అన్నీ ధోనీ కి యెనలేని పేరు తెచ్చిపెట్టాయి.
భువనేశ్వర్ కుమార్: ప్రస్తుత క్రికెట్ యుగంలో అత్యుత్తమ స్వింగ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఒకడు. పాకిస్థాన్‌తో జరిగిన అరంగేట్రం సిరీస్‌లో భువనేశ్వర్ వేసిన బౌలింగ్ ఒక సంచలనం. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ క్రికెటర్… భారత్ కు జాతీయ జట్టులో సీనియర్ బౌలర్ గా ఉన్నాడు. ఒకానొక దశలో బూట్లు కూడా లేని పరిస్థితి నుంచి… ప్రస్తుతం అత్యధిక పారితోషికం పొందుతున్న భారతీయ క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు.
రోహిత్ శర్మ; ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్, టీం ఇండియా ప్రస్తుత వైట్ బాల్ కెప్టెన్ రోహిత్ శర్మ కుటుంబం కూడా ఆర్ధికంగా ముందు వెనుకబడినదే. రోహిత్ శర్మ తల్లిదండ్రులు అతని స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. క్రికెటర్ కావాలనే పట్టుదలను బలంగా పెట్టుకున్న రోహిత్ క్రమంగా జాతీయ జట్టులోకి వచ్చేసాడు. ఇప్పుడు టీం ఇండియా లో స్టార్ క్రికెటర్ గా మారిపోయాడు.
పాండ్యా బ్రదర్స్: ప్రస్తుతం టీం ఇండియాలో, ఐపిఎల్ లో ముంబై జట్టులో ఈ ఇద్దరూ కీలకంగా ఉన్నారు. క్రునాల్ పాండ్యా ఇబ్బంది పడుతున్నా హార్దిక్ పాండ్యా మాత్రం ప్రస్తుతం భారత జట్టులో సుస్థిర స్థానం దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇక ఈ ఇద్దరూ ఒకప్పుడు మ్యాగీ తో మాత్రమే కడుపు నింపుకునే పరిస్థితి. ఇప్పుడు మాత్రం కోట్లాది రూపాయల ఆస్తులతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు.