ఆ రెండూ క్రూర జీవులే. వాటిని చూస్తేనే ఇతర జీవులు హడలెత్తిపోతాయి. మనుషులు కూడా వాటికి భయపడుతారు. అలాంటిది ఆ రెండు జీవాలు ఎదురెదురుగా వెళితే ? ఏం జరుగుతుంది ? రెండూ ఒకదానిపై ఒకటి పోరాటం చేస్తాయా ? అంటే.. కొన్ని సందర్భాల్లో చేస్తాయి కావచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం మాకెందుకులే అని ఎంచక్కా జారుకుంటాయి. సరిగ్గా అక్కడ కూడా అలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.
ఆస్ట్రేలియాలోని కునునుర్రా అనే ప్రాంతంలో ఉన్న ఇవాన్‌హో క్రాసింగ్ వద్ద చెల్సీ, బ్రైస్ అనే ఇద్దరు చేపలు పడుతున్నారు. అయితే అదే సమయంలో వారు తమ వద్ద ఉన్న డ్రోన్ కెమెరా సహాయంతో చుట్టూ పరిసరాలను వీడియో తీస్తున్నారు. వారి డ్రోన్ కెమెరాకు ఒక ఆసక్తికరమైన దృశ్యం చిక్కింది. సుమారుగా 16 అడుగులు ఉన్న ఓ భారీ మొసలి, ఓ పిల్ల షార్క్ లు అక్కడి నీటిలో ఎదురెదురుగా వచ్చాయి. అయితే ఏం జరుగుతుందా అని వారు ఆసక్తిగా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు. కానీ పిల్ల షార్క్ నాకెందుకులే అన్నట్లుగా అక్కడి నుంచి నెమ్మదిగా పక్కకు తప్పుకుని అవతలికి వెళ్లిపోయింది.
కాగా సదరు సంఘటనను గత నెలలో చిత్రీకరించిన అనంతరం దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి 1.60 లక్షల వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోపై అనేక మంది కామెంట్లు చేస్తున్నారు. వామ్మో భారీ మొసలి, దాన్ని షార్క్ ముందుగానే పసిగట్టింది కనుకనే అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంది అని ఒక యూజర్ కామెంట్ చేయగా, అది మొసలా ? గాడ్జిల్లానా ? అని మరొకరు కామెంట్ చేశారు.
అయితే ఆ ప్రాంతంలో నిజానికి గతంలో తాము ఎప్పుడూ మొసళ్లు, షార్క్‌లను చూడలేదని, కానీ ఇప్పుడు చూస్తే భయమవుతుందని ఆ వీడియో తీసిన చెల్సీ, బ్రైస్ చెప్పారు. స్థానికులు అక్కడి నీటిలో చేపల కోసం ఎక్కువగా తిరుగుతుంటారని, కానీ అంత భారీ మొసలితోపాటు షార్క్‌లు కూడా ఉన్నాయని ఇప్పుడు తెలియడంతో ఇకపై వారు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.
Watch Video: