ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుపొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర వైభవం కన్నులపండువగా కొనసాగుతోంది. తెలంగాణ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్న వాగు కళకళలాడుతోంది.
ఈ నెల 16 నుంచి 19 వరకు మేడారం జాతర జరగనుంది. ఈ గిరిజన జాతరకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలోనే సమ్మక్క సారక్క జాతర కోసం అక్కడ అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నారు అధికారులు.
అయితే ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి పసుపు, కుంకుమలతో వన దేవతలకు పూజలు చేసి.. బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో మేడారం పరిసరాలు ప్రస్తుతం రద్దీగా మారిపోయాయి.
ఈ నేపథ్యంలోనే అక్కడి అధికారులు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. భక్తులందరూ కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తుల రద్దీతో సమ్మక్క సారక్క గద్దెలు నిండిపోయాయి. మరో వైపు కరోనా నియంత్రన చర్యలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.