ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైసీపీకి వ్యతిరేక ఓటు వేయడమనేది అంతర్గత సమస్య అన్నారు. అయితే వ్యతిరేక ఓటు వేసిన వారిపై మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. క్రాస్ ఓటింగ్ పై పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చిస్తామన్నారు.
అయితే ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో జరిగిన పరిణామాలపై మంత్రులు మండిపడుతున్నారు. చంద్రబాబుకు 2024 చివరి ఎన్నికలని.. బాబు చేసుకునే చివరి విజయోత్సవాలు ఇవే అని కాకాణి అన్నారు. అసెంబ్లీ సంఖ్యాబలం ప్రకారమే వైసీపీ 7 స్థానాల్లో పోటీ చేసిందని..రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బండారం బయటపడుతుందన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓటు ఉండదని.. కేవలం ప్రజలు వేసే ఒక ఓటు మాత్రమే విజయాన్ని నిర్ణయిస్తుందని 2024 లో వైసీపీదే ఘన విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయంలో టీడీపీ రెబల్ ఎమ్మెల్యే గిరిధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజక వర్గం అభివృద్ధి కోసం మాత్రమే ఓటు వేశానన్నారు. వైసీపీని మోసం చేసిన ఎమ్మెల్యేల డేటా వైసీపీ అధిష్టానం దగ్గర ఉందన్నారు.
టీడీపీ గతంలో ప్రలోభాలు చూపి 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసిందని.. ఇప్పుడే కూడా అదే ఆలోచనతో ఉందన్నారు. అయితే సరైన సమయంలో వైసీపీకి మోసం చేసిన ఎమ్మెల్యేలపై చర్యలుంటాయని తెలిపారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు మాకే ఓటేస్తారని టీడీపీ మైండ్ గేమ్ ఆడిందని.. కాని ఎవరు ఏం చేసినా నేను మాత్రం సీఎం జగన్ తోనే ఇక ముందని ఆయన తేల్చి చెప్పారు.