బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి వార్త తననెంతో కలచివేసిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఆయన కనీసం ఒక్కసారయినా తనకు ఫోన్ చేసేవారని, అలాంటిది ఆత్మహత్య చేసుకునేముందు ఎందుకు చేయలేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. కంటతడి పెట్టారు. 2020 జూన్ లో సుశాంత్ ముంబై బాంద్రా లోని తన ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు. ఆ రోజున తాను ఓ వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నానని, ఈ సమాచారం తెలియగానే ఆ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరానని స్మృతి చెప్పారు.
ఒకప్పుడు టీవీ నటి కూడా అయిన స్మృతి ఇరానీ.. ముంబైలో ఒక్కోసారి తమ సెట్స్ ఒకే చోట ఉన్నప్పుడు సుశాంత్ సింగ్ గురించి తెలుసుకున్నానని చెప్పారు. 2013 లో ‘కై పో చై’ మూవీలో సుశాంత్ తో కలిసి నటించిన అతని సహనటుడు అమిత్ సాధ్ కి ఫోన్ చేసి సుశాంత్ ఎందుకు బాధపడుతున్నాడో తెలుసుకోవాలని కోరానని ఆమె అన్నారు.
‘సుశాంత్ కి ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవని అమిత్ నాతో చెప్పాడు.. దీంతో కలవరం చెందిన నేను సుశాంత్ గురించి అమిత్ తో ఆరు గంటలు మాట్లాడాను. సుశాంత్ క్షేమం గురించి ఆందోళన చెందాను’ అని స్మృతి ఇరానీ వెల్లడించారు. సుశాంత్ ది ఆత్మహత్యేనని పోలీసులు చెప్పినప్పటికీ, తన కొడుకు మృతిపై ఆయన తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు నాడు అనుమానాలు వ్యక్తం చేశారు.
తన కుమారుడి గర్ల్ ఫ్రెండ్, నటి రియా చక్రవర్తి ఆమె కుటుంబం అతడిని సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించిందని సుశాంత్ తండ్రి ఆరోపించారు. దీంతో ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తు జరిగింది. చివరకు అది మాదకద్రవ్యాల కేసుగా కూడా మారింది. రియాను, ఆమె సోదరుడిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. సుశాంత్ కి మాదకద్రవ్యాలను అలవాటు చేశారని వారిపై కేసు మోపారు. నెల రోజుల తరువాత రియా చక్రవర్తి బెయిల్ పై విడుదలైంది.