వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే డిజిటల్ రూపీ దేశ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఆర్బీఐ త్వరలోనే డిజిటల్ రూపీ విడుదల చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి చాలా ఖర్చు ఆదా అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
నిర్వహణ ఖర్చులు, ప్రింటింగ్, పంపిణీ, నిల్వ రూపంలో ఖర్చులు తగ్గనున్నాయి. వ్యవస్థలో చలామణిలో ఉన్న భౌతిక కరెన్సీలో కొంత భాగం డిజిటల్ రూపీలోకి మారిపోనున్నట్టు తెలుస్తోంది. అంటే భౌతిక కరెన్సీ తగ్గిపోనుంది. భౌతిక కరెన్సీ తగ్గిందంటే ఆర్బీఐకి ఖర్చులు ఆదా అయినట్టే.
ప్రతి రూ.100 నోటు తయారీకి రూ.15 నుండి 17 ఖర్చు అవుతోంది. దీని కాల వ్యవధి నాలుగేళ్లు. అంటే పాతబడిన నోట్లను బ్యాంకుల నుంచి వెనక్కి తీసుకుని.. వాటి స్థానంలో కొత్తగా ముద్రించిన నోట్లను ఆర్బీఐ విడుదల చేస్తుంటుంది. ఇది ఎప్పుడూ నడిచే ప్రక్రియ. కనుక ఈ విధానంలో కరెన్సీ నోట్ల ముద్రణకు ఎంతో ఖర్చు చేయాల్సి ఉన్నట్టు తెలుస్తోంది.
సీబీడీసీతో కరెన్సీ నిర్వహణ ఖర్చు తగ్గుతుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ మాజీ ఉద్యోగి రామ్ రస్తోగి తెలిపారు. డిజిటల్ రూపీని వ్యక్తులు తమ మధ్య లావాదేవీలకు ఫియట్ కరెన్సీగా వినియోగించుకోవచ్చని అన్నారు. 2021 మార్చి నాటికి వ్యవస్థలో రూ.28.32 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉందన్నారు. 2020-21లో కొత్తగా 4,19,000 బ్యాంకు నోట్లను ఆర్బీఐ ముద్రించిందని స్పష్టం చేశారు.