తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకో నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేయాలని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణలో నవోదయ విద్యాలయాల ఏర్పాటుపై రాజ్యసభలో కే. కేశవరావు, లోకసభలో నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే.. ఈ వాయిదా తీర్మానాలను ఉభయ సభలు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.
తెలంగాణ బిడ్డలపై కేంద్రానికి ఎందుకీ వివక్ష.. వారు భారతీయులు కాదా..? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్ వేదికగా పలుమార్లు చెప్పినప్పటికీ.. కేంద్రం పెడచెవిన పెడుతోందని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు, ఎస్టీ రిజర్వేషన్లు, నిరుద్యోగం, నవోదయ విద్యాలయాల ఏర్పాటు వంటి అంశాలను లేవనెత్తామని తెలిపారు.
అందులో భాగంగానే నవోదయ విద్యాలయాల అంశంపై రాజ్యసభ, లోక్ సభల్లో వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు, రాష్ట్ర ప్రజలకు అన్యాయ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో ఉభయ సభల నుంచి వాకౌట్ చేశామని తేల్చి చెప్పారు.
రాష్ట్రంలోని 33 జిల్లాలకు 33 నవోదయ విద్యాలయాలు ఇవ్వాల్సిందేనని ఎంపీ డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా 7 ఐఐఎంలు.. 4 ఎంఐటీలు.. 16 ఐఐటీలు, 157 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. ఇందులో తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ కంటే చిన్న రాష్ట్రాలైన అసోంలో 27, గుజరాత్ లో 31, హర్యానాలో 21, హిమాచల్ ప్రదేశ్‌లో 17, మణిపూర్‌లో 11, త్రిపురలో 7 నవోదయ విద్యాలయాలు ఉన్నాయని నామా నాగేశ్వర్ రావు గుర్తు చేశారు.