మహాశివరాత్రి సందర్భంగా శివ భక్తులకు ఓ శుభవార్త. దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్ నాథ్ ధామ్ ఆలయం తలుపులు తెరిచేందుకు ముహూర్తం ఖరారైంది. ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ధామ్ తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
శనివారం మహాశివరాత్రి నాడు, ఉఖిమఠ్ లో సాంప్రదాయ పూజల తర్వాత పంచాంగ గణన నిర్వహించారు. ఈక్రమంలోనే కేదార్ నాథ్ ఆలయ తలుపులు తెరవడానికి అనుకూలమైన సమయం నిర్ణయించారు. ఈ ఏడాది మేఘ లగ్నంలో కేదార్ నాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. ఏప్రిల్ 25న ఉదయం 6.20 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. దీంతో బాబా దర్బార్ లో భక్తుల రద్దీ ప్రారంభమవుతుంది.
బాబా కేదార్ డోలీ యాత్ర ఏప్రిల్ 24 న కేదార్ నాథ్ చేరుకుంటుంది. ఓంకారేశ్వర్ ఆలయం, ఉఖిమత్ నుంచి కాలినడకన కేదార్ నాథ్ చేరుకున్న తర్వాత ఆలయ తలుపులు తెరవడానికి మరుసటి రోజు మతపరమైన ఆచారం ప్రారంభమవుతుంది. దాని తరువాత ఉదయం 6.20 గంటలకు కేదార్ నాథ్ ఆలయం తలుపులు తెరుస్తారు.
అయితే భయ్యా దుజ్ సందర్భంగా మంత్రోచ్చారణల మధ్య శీతాకాలం కోసం కేదార్ నాథ్ ఆయలం మూసివేయబడింది. సైన్యానికి చెందిన మరాఠా రెజిమెంట్ బ్యాండ్ బృందం భక్తిరస ప్రదర్శన చేసింది. తరువాత ఆలయం మూసివేసి డోలీ ఉఖిమత్ లోని ఓంకారేశ్వర్ ఆలయానికి బయలు దేరింది. అక్టోబర్ 29న ఓంకారేశ్వర్ దేవాలయంలోని శీతాకాలపు పూజా స్థలంలో డోలీని ప్రతిష్టించారు.