హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో భూకంపం సంభవించింది. ఉదయం 5.17 గంటలకు ధర్మశాలలో భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలు పై దీని తీవ్రత 3.2 గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.
ధర్మశాలకు 76 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. భూ అంతర్భాగంలో 5 కి.మీ లోతులో ప్రకంపనలు చోటు చేసుకున్నాయని తెలిపింది. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి,ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. ఉత్తరాఖండ్ లోని జోషీ మఠ్ లో భూకంపం వచ్చిన తరువాతి రోజే ధర్మశాలలో భూమి కంపించడం గమనార్హం.
రోజురోజుకి కుంగిపోతున్న జోషిమఠ్ లో శుక్రవారం అర్థరాత్రి 2.12 గంటలకు 2.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే జోషిమఠ్ లో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. భూమి కుంగిపోయిన ఘటనలో ప్రభావిత ప్రాంతంలోని హోటళ్లను కూల్చి వేసే పనులు అధికారులు మొదలుపెట్టారు.
చుట్టు పక్కల రోడ్లను పోలీసులు మూసివేశారు. నిరసనకారులు రాకుండా చర్యలు తీసుకున్నారు. పూర్తిగా వెనుకకు వంగి ఉన్న ఇళ్ళు, హోటళ్ళు ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. శాస్త్రవేత్తలు సూచించిన విధంగా నిర్మాణాలను కూల్చివేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేప్టటి పగుళ్లు ఏర్పడిన ఇళ్లను కూల్చివేసే పనులను ప్రారంభించారు. పట్టణంలో 4500 ఇండ్లకు గాను ఇప్పటి వరకు వెయ్యికి పైగా ఇళ్లకు పగుళ్లు ఏర్పడినట్టు అధికారులు గుర్తించారు.