జార్ఖండ్ ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్ సన్నిహితుల ఇళ్లపై ఈడీ సోదాలు చేసింది. పూజా సన్నిహితుల్లో ఇద్దరు వద్ద రూ.19.31 కోట్ల నగదును ఈడీ అధికారులు జప్తు చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగం, అవినీతికి సంబంధించి జరిపిన సోదాల్లో ఈ నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ వర్గాలు తెలిపారు.
మొత్తం రూ.19.31 కోట్లకు గానూ.. పూజా సింఘాల్ చార్టర్డ్ అకౌంటెంట్ సుమన్ కుమార్ ఇంట్లో రూ.17 కోట్లు దొరకగా.. మరో వ్యక్తి ఇంటి వద్ద రూ.1.8 కోట్లు అదనంగా దొరికాయని ఈడీ వర్గాలు తెలిపాయి. పూజా నివాసంలో జరిపిన సోదాల్లో అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు గల పత్రాలను జప్తు చేశామని ఈడీ అధికారి ఒకరు తెలిపారు.
జార్ఖండ్ తో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఈడీ మెరుపుదాడులు చేసింది. జాతీయ ఉపాధి హామీ పథకంలో దాదాపు 18 కోట్లు దారి మళ్లించారని వస్తున్న ఆరోపణలో భాగంగా దాడులు నిర్వహించినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు.
దీనిపై జార్ఖండ్ విజిలెన్స్ బ్యూరో కేసులు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు భావించడంలో ఈడీ రంగంలోకి దిగింది. ఖుంటీ జిల్లా జూనియర్ ఇంజినీర్ రామ్ బినోద్ ప్రసాద్ సిన్హాను అరెస్ట్ చేసింది ఈడీ.